తూర్పుగోదావరి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. 42వ రోజు బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర సాగింది. కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు.
ఊసరవెల్లి చంద్రబాబు: మంత్రి మేరుగ నాగార్జున
ఊసరవెల్లి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాజ్యాంగబద్ధమైన అవకాశాలు రాకుండా చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ ఎస్సీలపై అనేక దాడులు పాల్పడ్డారు. కులం, మతం, వర్గం, పార్టీ తారతమ్యం లేకుండా అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య చదివించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వమిది. పేదలకు 31 లక్షలు ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే అన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం: మంత్రి తానేటి వనిత
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ హయాంలో సామాజిక న్యాయం జరిగిందని మంత్రి తానేటి వనిత అన్నారు. అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని దూరం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు బురద జల్లుతున్నారు. పిల్లలకు అందించే ట్యాబులపై కూడా బురద జల్లుతున్నారు. జగనన్న అందిస్తున్న పాలనలో కంటెంట్ ఉంది. అందుకే ఆయన కటౌట్‌తో సాధికార బస్సు యాత్రలు చేయ గలుగుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం కడతారన్నారు.
ఇది ప్రజలు గ్రహించాలి : ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ
కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు కావాలా.. ప్రేమను పంచుతున్న జగన్ కావాలా అన్న విషయాన్ని జనం తెలుసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. మరో ఐదేళ్లు జగనన్నకు అవకాశం ఇస్తే విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు అద్భుతంగా రూపొందుతాయన్నారు.