కోర్సు
చివరి సంవత్సరంలోనే పారిశ్రామిక శిక్షణతో పాటు స్టైఫండ్
టెక్స్ టైల్ టెక్నాలజీ కోర్సు ద్వారా గణనీయమైన ప్రారంభ వేతనాలు
ప్రారంభం అయిన పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ
గుంటూరు : వ్యవసాయం తరువాత దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న జౌళి
పరిశ్రమకు నిపుణులను అందించటంలో గుంటూరులోని గవర్నమెంట్ ఇన్ స్టిట్యూట్ ఆప్
టెక్స్ టైల్స్ టెక్నాలజీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అత్యంత వేగంగా
అభివృద్ది చెందుతున్న రంగాలలో జౌళి పరిశ్రమ ఒకటిగా ఉండగా, మూడున్నర సంవత్సరాల
పాలిటెక్నిక్ (టెక్స్ టైల్ టెక్నాలజీ) కోర్సు ద్వారా ఈ సంస్ధ నిపుణులను
అందిస్తోంది. గుంటూరు కేంద్రంగా 1986లో స్ధాపించబడిన ఈ పాలిటెక్నిక్, 1997
నాటికి స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్ధగా రూపుదిద్దుకుంది. నిజానికి
జౌళి రంగం నిపుణుల కొరత ఎదుర్కుంటున్న నేపధ్యంలో ఈ కోర్సుకు అత్యంత ప్రాధాన్యత
ఉంది. కోర్సు పూర్తి చేసిన మరుక్షణం కనీసం రూ. 20,000 ప్రారంభవేతనంకు అవకాశం
ఉండగా, 2023 పాలిసెట్ లో అర్హత సాధించిన వారికి ఈ కోర్సులో అవకాశం
కల్పించనున్నట్లు సంస్ధ ప్రిన్సిపల్ కె.వి. రమణ బాబు, శాఖాధిపతి కె. మహమ్మద్
తెలిపారు. ఈ డిప్లమా కోర్సులో సంస్థ విద్యార్థులు జౌళి రంగంలోని స్పిన్నింగ్,
వీవింగ్, కెమికల్ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్ టెక్స్ టైల్,
ఆపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి విభాగాలలో సాంకేతిక నైపుణ్యతను సాధించి జాతీయ
స్దాయి పోటీని తట్టుకునే విధంగా తీర్చిదిద్దబడతారు. పారిశ్రామిక అవసరాలకు
అనుగుణంగా నైపుణ్యాలను అందించే క్రమంలో నిరంతరం సిలబస్ ను ఆధునికరించడంతో
పాటు, ఒక సంవత్సరం పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణను అందించి నెలకు 7000
రూపాయల స్టైఫండ్ సైతం ఇస్తుండటం ఇక్కడి విశేషం. అనుభవజ్ఞులైన లెక్చరర్ల చే
విద్యాబోధన, సంబంధిత ల్యాబ్లో ప్రాక్టికల్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, పరిశ్రమ
ప్రముఖుల ద్వారా సెమినార్స్ అందిస్తూ సమగ్ర శిక్షణ అందించే సంస్ధగా గవర్నమెంట్
ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్స్ టైల్స్ టెక్నాలజీ ప్రత్యేక పాత్రను పోషిస్తోందని
ప్రిన్సిపల్ రమణ బాబు వివరించారు. పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు
క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకున్న ప్రతి
విద్యార్థికి సగటున రెండు నుండి మూడు సంస్థలలో రూ. 18,000 నుండి 20,000 రూపాయల
జీతభత్యాలతో ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. పది సంవత్సరముల లోపు అనుభవంతోనే
మెరుగైన జీతంతో మేనేజ్మెంట్ స్థాయి కెరీర్ ను అందుకునేందుకు ఈ రంగం
దోహదపడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. వీలవుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ
రంగం దేశంలో 10 కోట్ల మందికి ఉపాధిని అందిస్తుండగా, ప్రపంచంలో మన దేశం జౌళి
పరిశ్రమ పరంగా ప్రగతి సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల మిల్లులలోనే కాక కర్ణాటక,
గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలలోని ప్రముఖ పరిశ్రమలలో ఈ సంస్థ
విద్యార్థులు అనుభవానికి అనుగుణంగా మూడు లక్షల వరకు జీతంతో జనరల్ మేనేజర్,
టెక్నికల్ మేనేజర్, మిల్ మేనేజర్, గ్రూప్ మేనేజర్ వంటి అత్యుత్తమ స్థాయి
హోదాలలో రాణిస్తున్నారు. పదవ తరగతి తరువాత డిప్లమాని అర్హతగా కెరియర్ పిరమిడ్
లో అత్యున్నత స్థాయి సాధించటం ఒక్క టెక్స్ టైల్ టెక్నాలజీ కోర్స్ తోనే సాధ్యం
అనటం అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా రమణ బాబు మాట్లాడుతూ అత్యధిక ఉద్యోగ ఉపాధి
అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమి వల్ల విద్యార్దులు అపోహలలో ఉన్నారన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 300 పైచిలుకు జౌళి మిల్లులలో ప్రతి సంవత్సరం
వందలాది నిపుణులు అవసరమైనప్పటికీ కనీసం 50 మంది కూడా జాబ్ మార్కెట్లో
అందుబాటులో ఉండటం లేదన్నారు. పాలిటెక్నిక్ అడ్మిషన్లు ప్రారంభం అయిన
నేపధ్యంలో విద్యార్ధులు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్ టైల్ టెక్నాలజీ
సంస్థలో డిప్లమా ఇన్ టెక్స్ టైల్ టెక్నాలజీ కోర్సును ఎంచుకోవాలన్నారు.
డిప్లమో తర్వాత బీటెక్, ఎంటెక్, పిహెచ్ డి వంటి విద్యార్హతలు సాధించి ప్రముఖ
విద్యాసంస్ధలలో లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా, పరిశోధన సంస్థల్లో
శాస్త్రవేత్తలుగా రాణించగలుతారన్నారు. బంగ్లాదేశ్, వియత్నాం లాంటి చిన్న
దేశాలు ప్రముఖ ఆర్థిక వ్యవస్థలుగా ఎదగడానికి టెక్స్ టైల్ రంగంలో సాధించిన
అభివృద్ధే కారణమని ఆర్ధిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని వనరులు కల మన
దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి
చేయటానికి కృషి చేస్తున్నాయి. ఫలితంగా మున్ముందు దేశంలో టెక్స్ టైల్ రంగంలో
విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాలలో అవకాశాలు గణనీయంగా
పెరుగుతాయి. ఈ కోర్సు చదివిన వారు అతి తక్కువ ఉండటం వలన ప్రతి విద్యార్థికి
మరింత డిమాండ్ ఏర్పడి జీతభత్యాలలో కూడా పురోగతి నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇతర
వివరములకు 9848372886, 8500724006 నంబర్ల ను సంప్రదించవచ్చు.