బీసీల మనోభావాలను పార్టీలన్నీ గౌరవించాలి
శ్రీకాకుళం ఎంపీ టికెట్, పలాస ఎమ్మెల్యే టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి
డాక్టర్ దుంపల వెంకటరవి కిరణ్ కు శ్రీకాకుళం ఎంపీ లేదా పలాస ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి
ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్
విజయవాడ : రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీసీ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేష్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఎంపీ టికెట్ ను పలాస ఎమ్మెల్యే టికెట్ ను బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. ఉత్తరాంధ్ర జనాభాలో 70శాతం పైగా బీసీలు ఉన్నారని బీసీల హక్కులు , బీసీల మనోభావాలను పార్టీలన్నీ గౌరవించాలని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రతి జిల్లాలోనూ సగానికి పైగా బీసీలకు సీట్లు కేటాయించాలని అంశంపై బీసీల ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల దాటుతున్నా బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారని, చట్టసభలలో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు బీసీల పక్షపాతిగా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు బీసీల ఆర్థిక బలోపానికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు.
బీసీలకు రాజ్యాధికారంలో 65శాతం పైగా వాటా కేటాయించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభ స్థానాల వరకు మంత్రి మండలి ఎమ్మెల్సీలుగా బీసీలకు అగ్ర తాంబూలం ఇచ్చిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బీసీల ఆత్మ గౌరవాన్ని గౌరవించిన జగన్మోహన్ రెడ్డికి బీసీలందరూ అండగా నిలబడాలని కోరారు. గతంలో రాజ్యసభ సీట్లు వందల కోట్లకి అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే అదే రాజ్యసభ సీట్లను నలుగురికి బీసీలకు ఇచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదని, బీసీల ఉద్యమకారుడు ఆర్ కృష్ణయ్య సేవలను గుర్తించి వందల కోట్లు విలువచేసే రాజ్యసభను ఆర్ కృష్ణయ్య కి ఇవ్వడం అనేది బీసీల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 70శాతం పైగా బీసీలు ఉన్నందున బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. శ్రీకాకుళం ఎంపీ టికెట్, పలాస ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ దుంపల వెంకట రవి కిరణ్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ జక్కా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి గోవింద్, రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, పలు కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.