విశేషంగా దర్శించుకున్న భక్తులు
తిరుపతి : టిటిడి స్థానిక ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సోమవారం ఘనంగా
నిర్వహించారు. విశేషంగా భక్తులు దర్శించుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో : తిరుచానూరు శ్రీ పద్మావతి
అమ్మవారి ఆలయంలో ఉదయం ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా
నిర్వహించారు. ఆ తర్వాత తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపు
చేపట్టారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాస ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార
దర్శనం కల్పించారు. జనవరి 3న ద్వాదశి నాడు ఉదయం 7 నుండి 9 గంటల వరకు
శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు తిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.
శ్రీనివాసమంగాపురంలో : శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి
ఆలయంలో ధనుర్మాస కైంకర్యాల అనంతరం వేకువజామున 2.30 గంటల నుండి భక్తులకు
వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ద్వాదశి సందర్భంగా మంగళవారం కూడా ఆలయంలో
భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు
చక్రస్నానం నిర్వహిస్తారు.
అప్పలాయగుంటలో : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
వేకువ జామున 3 నుండి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి,
ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను
సర్వదర్శనానికి అనుమతించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం
నిర్వహించారు. జనవరి 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 7 నుండి 8 గంటల వరకు
స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. అదేవిధంగా, నారాయణవనంలోని
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామివారి
ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయంలో వైకుంఠ
ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.