కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్‌తో రట్టు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీటీ)కి కేంద్రం భారీ జరిమానా
విధించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద పొందిన
లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ రూ.3
కోట్ల జరిమానా విధించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్‌తో ఈ
వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా
శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ
రూ.30కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాకుండా ఎస్బీఐ వద్ద మూలుగుతోంది.
లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో మారకానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)
అంగీకరించలేదు.
అసలేం జరిగింది
విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి టీటీడీ కేంద్ర హోం శాఖ నుంచి
ఎఫ్సీఆర్ఏ చట్టం కింద లైసెన్సు పొందింది. దానివల్ల 2018 వరకూ విదేశీ కరెన్సీ
మారకానికి ఆర్బీఐ అనుమతించేది. ఎస్బీఐ కూడా విదేశీ కరెన్సీని టీటీడీ ఖాతాలో
డిపాజిట్ చేసేది. 2018లో లైసెన్సు గడువు ముగిసింది. దాని రెన్యువల్‌పై టీటీడీ
దృష్టి సారించలేదు. కేంద్ర హోం శాఖలోని ఎఫ్సీఆర్ఏ విభాగం 2019లో దీన్ని
గుర్తించింది. లైసెన్సు లేకపోయినా టీటీడీ విదేశీ విరాళాలు సేకరించడంపై
అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్ల జరిమానా విధించింది. ఎఫ్సీఆర్ఏ
చట్టానికి 2020లో చేసిన సవరణల ప్రకారం.. విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా
సంస్థలు వినియోగించుకోకూడదు. కానీ టీటీడీ వినియోగించుకోవడంపై కూడా కేంద్రం
అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ
ఫార్మాట్లో ఇవ్వలేదని తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో
జరిమానా మొత్తం రూ.4.33 కోట్లకు చేరుకుంది.
ట్వీట్‌తో రగులుకున్న వివాదం
టీటీడీకి జరిమానా విధించడంపై కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ తాజాగా
ట్వీట్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీకి జరిమానా
విధించడాన్ని ఆయన తప్పు పట్టారు. దీంతో ఇది రాజకీయ వివాదంగా మారుతోంది. టీటీడీ
సకాలంలో రెన్యువల్ ఎందుకు చేయలేదు? అంటే ప్రస్తుత అధికారులు గానీ, పాలకవర్గం
గానీ సరైన సమాధానం చెప్పడం లేదు.
రూ.3 కోట్లు జరిమానా చెల్లించాం: సుబ్బారెడ్డి
కేంద్ర హోంశాఖ ఎఫ్సీఆర్ఏ విభాగానికి రూ.3 కోట్ల జరిమానా చెల్లించామని టీటీడీ
బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విదేశీ కరెన్సీని విరాళాలుగా
స్వీకరించేందుకు కేంద్రం నుంచి టీటీడీ పొందిన ఎఫ్సీఆర్ఏ లైసెన్సును 2018కి
ముందే నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో రద్దు చేశారన్నారు. టీటీడీ వ్యాపార
కేంద్రం కాదని, ఓ ఽధార్మిక క్షేత్రమని, అనేక మంది భక్తులు భక్తితో కానుకలు
సమర్పిస్తారని వివరించడంతో జరిమానాను రూ.3 కోట్లుగా నిర్ణయించారన్నారు. ఈ
మొత్తాన్ని టీటీడీ చెల్లించిందన్నారు. మరో వారం పదిరోజుల్లో సమస్య
పూర్తిస్థాయిలో పరిష్కారమైపోతుందన్నారు.