శ్రీకాకుళం : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన తెదేపా కార్యకర్త కంచరాన అసిరి నాయుడు గుండెపోటుతో మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. మృతుడి భార్య అరుణకుమారికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. భువనేశ్వరి వెంట మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎమ్మెల్సీ అనురాధ, నేతలు కిమిడి నాగార్జున, రాంమల్లిక్‌నాయుడు తదితరులు ఉన్నారు.
బాధితులకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
సీతంపేట : చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన భామిని మండలం బిల్లుమడకు చెందిన విశ్వనాథం కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందన్నారు. తమ కుమారుడికి ఉద్యోగం కల్పించాలని విశ్వనాథం భార్య వనజాక్షి భువనేశ్వరిని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ వివరాలను నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయకృష్ణకు అందజేయాలని సూచించారు.