కాకినాడ : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేత వరుపుల రాజా
(47) శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. ఉత్తరాంధ్ర
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జిగా
వ్యవహరిస్తున్న ఈయన కొద్దిరోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొని, శనివారం
సాయంత్రం స్వగ్రామం ప్రత్తిపాడు చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, బంధువులతో
రాత్రి 8.30 గంటల వరకు మాట్లాడారు. అనంతరం తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన్ను
హుటాహుటిన కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తాము ఎంతగా శ్రమించినా
ఫలితం లేకపోయిందని, రాత్రి 11.20 గంటలకు వరుపుల రాజా కన్నుమూసినట్లు అపోలో
వైద్యులు ప్రకటించారు. ఆయనకు గతంలో రెండుసార్లు గుండెపోటు రావడంతో స్టంట్లు
వేశారు. ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజా
డీసీసీబీ ఛైర్మన్గా, ఆప్కాబ్ వైస్ ఛైర్మన్గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో
టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
చురుకైన నేత హఠాన్మరణంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.