టీ-20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదయ్యింది. పటిష్టమైన ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ జట్టు విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చింది. దీంతో సూపర్-12 దశలో ఐర్లాండ్ చరిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు బాగానే రాణించారు. 19.2 ఓవర్లలో ఆలౌట్ అయినప్పటికీ 157 పరుగుల సవాలు లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది.
ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఐర్లాండ్ ఆటగాళ్లు రాణించారు. స్వల్ప విరామాల్లోనే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా 14 పరుగులకే ఓపెనర్లు జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వికెట్లను తీశారు. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో ఇంగ్లండ్ వికెట్లు తీయగలిగారు. దీంతో 14.3 ఓవర్ల వద్ద 105 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ 5 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయానికి 33 బంతుల్లో 53 పరుగులు అవసరమైన సమయంలో క్రీజులో మొయిన్ అలీ(24 నాటౌట్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్)తో క్రీజులో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో వర్షం పడింది. దీంతో ఆట నిలిచిపోయింది. కాసేపు వేచిచూసినా తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అంపైర్లు ఫలితాన్ని తేల్చారు. దీంతో ఐర్లాండ్ ఆటగాళ్లు సంబరంలో మునిగిపోయారు.