రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ : రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ శాఖల కు సంబంధించి బడ్జెట్ అంచనాల ముందస్తు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్నో ప్రముఖ దేవాలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశం ఉందని, ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెద్దగా ఆదాయం లేని దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు. ప్రధానంగా అటవీ శాఖతో కలిసి టెంపుల్ టూరిజాన్ని, ఎకో టూరిజం తో కలిపి టూరిస్ట్ సర్క్యూట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు సంబంధించి దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు.
రాష్ట్రంలో అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నివ్వడంతోపాటు, ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థిక పరమైన మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత మెడిసినల్ ప్లాంటేషన్ లను చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో ఈ మెడిసినల్ ప్లాంటేషన్ లకు సంబంధించి మార్కెటింగ్ కు అనుసందానం చేయాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీ, ఎకో టూరిజంకు నగర వాసుల్లో మంచి ఆదరణ ఉందని ,ఈ విధమైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క చెప్పారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న దేవుడి మాన్యాల పరిరక్షణతో పాటు, అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని తెలియ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణకు చెందిన భక్తులు అత్యధికంగా సందర్శిస్తూ, గణనీయమైన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నప్పటికీ, తెలంగాణా భక్తులకు కూడా తిరుమలలో ప్రాధాన్యత నిచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. వన్యప్రాణుల దాడుల్లో ఎవరైనా మరణిస్తే పరిహారాన్ని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షకు తమ ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను తిరిగి పునరుద్దరించనున్నట్టు తెలిపారు. దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించి ప్రతిపాదిక బడ్జెట్ నిధులను ఉదారంగా కేటాయించాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ అనీల్ కుమార్, ప్రిన్సిపాల్ సీసీఎఫ్ దొబ్రియల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి C. దామోదర రాజనర్సింహ హైదరాబాద్ లో ని నాంపల్లి లో 83వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ -2024 ను పురస్కరించికొని ఎగ్జిబిషన్ సొసైటీ – యశోద హాస్పిటల్స్ సంయుక్త ల అధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య కేంద్రం (Health Center) ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉందన్నారు . ముఖ్యంగా మాత, శిశు సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 83 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా సుమారు 30 వేల మంది విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు విద్యను అందిస్తున్నందుకు అభినందించారు. యశోద ఆసుపత్రి ప్రారంభించి 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 83వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ -2024 లో ‘వైద్య ఆరోగ్య కేంద్రం’ ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. వారు అందిస్తున్న సేవలను కొనియాడారు మంత్రి C. దామోదర రాజనర్సింహ.
వైద్య ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం లో ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ సెక్రెటరీ హనుమంత్‌రావు, ఉపాధ్యక్షులు వనం సత్యేంద్ర, అడ్వైజర్ GS శ్రీనివాస్, కమిటీ సభ్యులు, యశోదా ఆసుపత్రి డైరెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.