అభ్యర్థిగా తాను బరిలో ఉండటం లేదని, తన సతీమణి వాణి పోటీ చేస్తారని ఎమ్మెల్సీ
దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆమోదం
తెలిపారని చెప్పారు. శుక్రవారం టెక్కలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో
దువ్వాడ మాట్లాడారు. తననే అభ్యర్థిగా గతంలో సీఎం ప్రకటించినా మహిళా సాధికారతను
దృష్టిలో ఉంచుకుని తానే అభ్యర్థి మార్పు ప్రతిపాదనను అధిష్ఠానం ముందు ఉంచానని
చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ గెలిచేందుకు ఈ నిర్ణయం
దోహదపడుతుందన్నారు. వైసీపీ శ్రేణులు సమష్టిగా పనిచేసి దువ్వాడ వాణిని
గెలిపించాలని శ్రీనివాస్ కోరారు.
టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ వాణిని ఎమ్మెల్సీ శ్రీనివాస్ ప్రకటించడం
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 19న మూలపేట
పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సీఎం నౌపడలో నిర్వహించిన బహిరంగ సభలోనే దువ్వాడ
శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీనివాస్‌ను మీ చేతుల్లో
పెడుతున్నానంటూ అక్కడి ప్రజలకు జగన్ చెప్పారు. టెక్కలి వైసీపీలో ఎలాంటి
కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ అధినేతే
బహిరంగ సభలో ప్రకటన చేసినా ఇప్పుడు హఠాత్తుగా వాణి పేరును ఆమె భర్తే
వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది. నౌపడ సభలో జగన్ చేసిన ప్రకటన తర్వాత
జరిగిన పరిణామాలే అభ్యర్థిత్వం మార్పునకు కారణంగా పలువురు భావిస్తున్నారు.
ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణియే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించి
పంతం పట్టారని, నేరుగా ఆమె ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో పలు
దఫాలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ
విషయంలో ఇతర నేతలతో కాకుండా నేరుగా దువ్వాడ శ్రీనివాస్‌తోనే వైసీపీ అధిష్ఠానం
ప్రకటన చేయించినట్లు తెలుస్తోంది.