చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత
గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ లో అవగాహనా సదస్సు
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారా జౌళి రంగంలోకి అడుగిడే సువర్ణ అవకాశం
గుంటూరు : టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని విధ్యార్ధులు ఈ కోర్సులను ఎంచుకోవటం ద్వారా తక్షణం ఉపాధి పొందవచ్చని చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె. సునీత తెలిపారు. టెక్స్టైల్స్ టెక్నాలజీ విభాగంలోని పాలిటెక్నిక్ కోర్సులపై అవగాహన కల్పించే క్రమంలో చేనేత, జౌళి శాఖ బుధవారం గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ లో క్రియాశీలక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఆశాజనకమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, టెక్స్టైల్స్ రంగంలో వృత్తిని ఎంచుకునేలా విద్యార్థులను ప్రేరేపించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. టెక్స్టైల్స్ రంగంలో విస్తారమైన అవకాశాలను నొక్కి చెబుతూనే వివిధ కోర్సులను అన్వేషించమని విద్యార్థులకు సూచించారు. ఒక వైపు నిరుద్యోగం, మరోవైపు ఇతర రంగాలలో తొలగింపుల సవాళ్ల నేపధ్యంలో వస్త్ర పరిశ్రమలో విద్యార్థులకు తక్షణ ఉద్యోగం అందుబాటులో ఉందన్నారు. టెక్స్‌టైల్స్‌లో భవిష్యత్తుకు గేట్‌వే అయిన ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సునీత కోరారు.
జిల్లా కలెక్టర్ వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి స్థానికంగా అందుబాటులో ఉన్న మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జౌళి రంగ కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మహమద్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ లో జౌళి కోర్సులు అభ్యసించినవారు ఇతర కోర్సులతో పోల్చినప్పుడు ఉపాధి పరంగా ముందంజలో ఉన్నారని స్పష్టం చేసారు. జ్యోతిర్మయి టెక్స్టైల్స్ జిఎం బి వెంకటేశ్వర్లు, ఏటీఈ ఎంటర్ప్రైజెస్ సేల్స్ మేనేజర్ ఎండీ ఖదీర్ ఖాన్ లు టెక్స్టైల్ రంగంలో తమ పారిశ్రామిక అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కార్యక్రమంలో ఎపి టెక్స్ టైల్స్ అసోసియేషన్ ఛైర్మన్ కోటి రావు, విజ్ణాన్ విశ్వవిద్యాలయం సహాయ అచార్యులు శివ జగదీష్ కుమార్, టెక్స్టైల్ మిల్లుల సంఘం ప్రతినిధులు రఘురాంరెడ్డి , చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు కన్న బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.