అమరావతి : ప్రజలకు ఆధునిక వైద్య విధానాలను చేరువ చేసే టెలిమెడిసిన్ విధానం
నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆరోగ్య
కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్
అన్నారు. టెలిమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆగ్నేయాసియా రీజియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన వర్క్ షాప్ లో
మంగళగిరి ఎపిఐఐసి భవనం నుండి ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెలి కన్సల్టేషన్ సేవలను అన్ని పిహెచ్ సిలు, వైఎస్ఆర్
విలేజ్ హెల్త్ క్లినిక్ లకు విస్తరించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం
రాష్ట్రంలో 27 టెలి మెడిసిన్ హబ్ లను ఏర్పాటు చేశామన్నారు. 8351 విలేజ్ హెల్త్
క్లినిక్ లలో కూడా ఈ సేవలు అందుబాటులో వున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు
60,000 టెలి కన్సల్టేషన్లు నమోదవుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ
9.7 కోట్ల టెలి కన్సల్టేషన్ సేవలు నమోదు కాగా, అందులో 3.1 కోట్ల (32 శాతం)
టెలి కన్సల్టేషన్ సేవలు ఎపిలోనే నమోదయ్యాయనీ, తద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందన్నారు. ఎపి ప్రభుత్వం 2019 నవంబర్ 7నుండి 330
పిహెచ్ సిలలో ఇ -సంజీవని పేరుతో టెలిమెడిసిన్ సేవల్ని ప్రయోగాత్మకంగా
ప్రారంభించిందన్నారు. వీటితో పాటు ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం,
సిద్ధార్ధ మెడికల్ కాలేజ్ విజయవాడ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలలో
మూడు తెలిమెడిసిన్ హబ్ లను ఏర్పాటు చేశామన్నారు. టెలి మెడిసిన్ హబ్ ల ద్వారా
స్పెషలిస్ట్ వైద్య సేవల్ని వీడియో విధానంలో సబ్ సెంటర్లు, పిహెచ్ సిలలోని
రోగులకు అందిస్తున్నామన్నారు. ఆన్ లైన్ లోనే రోగులకు అవసరమైన మందులను సూచించే
ప్రిస్క్రిప్షన్లను జారీ చేస్తున్నామన్నారు. ప్రతి టెలిమెడిసిన్ హబ్ లో ఒక
జనరల్ పిజీషియన్, ఒక పెడియాట్రీషియన్, ఒక గైనకాలజిస్ట్, ఇద్దరు జనరల్ డ్యూటీ
వైద్యాధికారులు పేషెంట్లకు టెలి కన్సల్టేషన్ సేవల్ని అందిస్తున్నారని నివాస్
వివరించారు.
జిల్లా ఆస్పత్రులు/ బోధనా ఆస్పత్రుల నుండి అందుబాటులో వున్న వైద్యుల్ని కూడా ఈ
సేవలకు వినియోగించుకుంటున్నామన్నారు. ఖాళీగా వున్న పోస్టుల్ని ఎప్పటికప్పుడు
భర్తీ చేసి రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నడపాలని ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి సూచించారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైద్య సేవల్ని
ప్రజలకు మరింత చేరువచేసేందుకు సిఎం నిర్ణయం దోహదపడిందన్నారు. ప్రస్తుతం
అందుబాటులో వున్న 27 టెలి మెడిసిన్ హబ్ లతో పాటు 1684 స్పోక్ కమ్ హబ్ లను
అందుబాటులోకి తెచ్చామన్నారు. టెలిమెడిసిన్ హబ్ లు, స్పోక్ కమ్ హబ్ లలోని
సిబ్బందికి రెగ్యులర్ గా శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామన్నారు.
సిబ్బంది, వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రతిస్థాయిలోనూ నిత్యం
సమీక్షిస్తుంటామన్నారు.