హైదరాబాద్ : ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 10)తో ముగియాల్సి ఉంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని, గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ వచ్చారు. మొత్తం పెండింగ్ చలాన్లు 3 కోట్ల 9 లక్షల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కోటీ 7 లక్షల మంది మాత్రమే ఛలాన్లు చెల్లించగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో గడువును పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గడువు పొడిగించిన నేపథ్యంలో ఇంకా ఎవరైనా చెల్లించకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే.