ముగ్గురు మృతి చెందినా తాగునీటి సరఫరా లోపాలను సరిదిద్దేవారే లేరు
రూ.1400 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న గుంటూరు కార్పొరేషన్లో రక్షిత నీటి సరఫరా కూడా చేయలేకపోతున్నారు
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం స్పందించాలి
బాధ్యత తీసుకొని సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి
ఇంటింటి సర్వే నిర్వహించి, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అతిసార వ్యాధి బాధితులను పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : గత వారం రోజులుగా గుంటూరు నగరంలో ప్రజలు అతిసార వ్యాధి బారినపడి సుమారు 200 మందికిపైగా ఆస్పత్రి పాలైతే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమీ లేవు. ఈ ఒక్క రోజే 15 మంది వరకు బాధితులు వచ్చినట్లు వైద్యులు, సిబ్బంది చెబుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన స్పందన లేదు. ప్రజలు ఆపదలో ఉన్నపుడు రాజకీయాలకు అతీతంగా పాలక వర్గం వేగంగా స్పందించాలి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో గత కొద్దిరోజులుగా కలుషిత నీరు తాగడం వల్ల వివిధ ప్రాంతాల్లోని ప్రజలు అతిసార వ్యాధి బారిన పడి వాంతులు, విరేచనాలతో వరుసగా గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చేరుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న మనోహర్ సమస్య తీవ్రం కావడటంతోపాటు, మరణాలు నమోదు అవుతుండటంతో శనివారం గుంటూరు సర్వజన ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. అందుతున్న వైద్యం గురించి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. జాగ్రత్తగా ఉండాలని తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద విలేకరులతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘రూ.1400 కోట్ల బడ్జెట్ ఉన్న గుంటూరు నగరపాలక సంస్థ నీటి సరఫరా విషయలో ఎక్కడ లోపాలున్నాయో ఇప్పటి వరకు గుర్తించలేదు. బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి తూతూమంత్రపు స్పందన తప్ప, సమస్యను పరిష్కరించేలా ప్రయత్నం జరగకపోవడం విచారకరం. వెంటనే ప్రభుత్వం స్పందించి గుంటూరు నగరంలో ఇంటింటి సర్వే చేపట్టాల్సిన అవసరం ఉంది. మిగిలిన వారికి తగిన వైద్యం అందించాలి. ఆస్పత్రికి రాకుండా ఇళ్ల వద్దనే చికిత్స తీసుకుంటున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను వెంటనే ఏర్పాటు చేయాలి. అసలు తాగునీటి సరఫరా విషయంలో ఏం జరిగిందో విచారణ చేపట్టాలి. కలుషిత నీటి వల్ల అతిసారం బారిన పడి ముగ్గురు మృతి చెందడం చిన్న విషయం కాదు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మురికివాడల్లోనే ఎక్కువగా బాధితులు కనిపిస్తున్నారు. ఆ వాడలకు వెళ్లే తాగునీటి సరఫరాను పరీక్షలకు పంపాలి. ఏమైనా లోపాలుంటే వెంటనే సరిచేయాలన్నారు.
ఘటనపై విచారణ చేయించాలి : నగరపాలక సంస్థ అధికారులు యంత్రాంగాన్ని వేగంగా పని చేయించేలా చూసి, తాగునీటి సరఫరాలోని లోపాలను వెంటనే అరికట్టాలి. గుంటూరు లాంటి పెద్ద నగరంలో సుమారు 15 లక్షల మందికి పైగా ఉండే నగరంలో జరుగుతున్న మంచి నీటి సరఫరాలో ఎన్నో లోపాలున్నట్లు ప్రాథమికంగా తేలింది. నీటిని కనీసం ఫిల్టరైజేషన్ చేయకుండానే, శుద్ధి చేసే బెడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే సమాచారం వచ్చింది. దీనిపై వెంటనే దృష్టి సారించాలి. నీటిని శుద్ధి చేసే వ్యవస్థపై దృష్టి సారిస్తే లోపం ఏమిటనేది పూర్తిగా తెలుస్తుంది. బాధితులకు జనసేన పార్టీ తరఫున అండగా నిలుస్తాం. బాధితులకు తగిన ఆహార పదార్థాలు, మందులు, హెల్త్ డ్రింక్స్ ను పార్టీ తరఫున సరఫరా చేసే బాధ్యతను తీసుకుంటాం. అలాగే ప్రభుత్వం తరఫున కూడా బాధితులకు తగిన ఆర్థిక సాయం అందించాలి. అలాగే వారి ఆరోగ్యం మెరుగుదల కోసం వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. విషయాన్ని చిన్నదిగా చూపాలనే దృష్టిని పక్కన పెట్టి, సమస్యను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ డిమాండు చేస్తోంది. ఇంతమంది బాధితులుగా మారడానికి కారణమైన పరిస్థితులపై విచారణ చేపట్టాలి. ముగ్గురు మృతి చెందిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.