హైదరాబాద్ : సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడి
నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన డాక్టర్ ధరావత్ ప్రీతి కేసు రోజుకో
మలుపు తిరుగుతోంది. ప్రీతిని తాను ర్యాగింగ్ చేసిన మాట వాస్తవమేనని పోలీసుల
విచారణలో సైఫ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్
రిపోర్టులో పోలీసులు ఈ విషయాన్ని పేర్కొన్నట్టు సమాచారం. ఆధారాలు చూపించి
ప్రశ్నించడంతో ఫిబ్రవరి 26న ప్రీతి మృతి చెందిన తర్వాత సైఫ్‌ను పోలీసులు
అరెస్ట్ చేశారు. ప్రీతి ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని పోలీసులు చెప్పినా అతడు
మాత్రం ఖండించాడు. తాను ర్యాగింగ్ చేయలేదని, సీనియర్‌ను కాబట్టి పొరపాట్లు
చేస్తుంటే చెప్పానే కానీ, అది ర్యాగింగ్ కాదని వాదిస్తూ వచ్చాడు. అయితే,
పోలీసులు అతడి వాట్సాప్ చాటింగులు బయటకు తీసి సైఫ్ ఉద్దేశపూర్వకంగానే
ర్యాగింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేసి
రిమాండుకు తరలించారు. ఆ తర్వాత నాలుగు రోజులపాటు జరిపిన విచారణలో ఆధారాలు
చూపించి సైఫ్‌ను ప్రశ్నించడంతో ర్యాగింగ్ చేయడం నిజమేనని అంగీకరించినట్టు
తెలుస్తోంది. కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 6న సైఫ్‌ను కోర్టులో ప్రవేశ
పెట్టారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్టులో ర్యాగింగ్‌ను
సైఫ్ అంగీకరించాడని పేర్కొన్నట్టు సమాచారం.