న్యూ ఢిల్లీ : దేశంలో తీవ్రవాదంపై, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడే సంస్థల భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కఠినంగా పోరాడితే తప్ప ఉగ్రవాదంపై విజయం సాధించలేమని తేల్చి చెప్పారు. దేశంలో అంతర్గత భద్రతపై బుధవారం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో హోం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరిహద్దు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడి చేయాలంటే దాని ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని సూచించారు. తీర ప్రాంత భద్రతను అభేద్యంగా మార్చాలని, ప్రతి ఓడరేవుపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. దేశంలో యువతను డ్రగ్స్ నాశనం చేస్తున్నాయన్న అమిత్ షా డ్రగ్స్ ద్వారా ఆర్జించే డబ్బు అంతర్గత భద్రతను ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకోసం ప్రతిఒక్కరం కలిసి పోరాడి డ్రగ్స్‌ను పూర్తిగా నాశనం చేయాలన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎనిమిదేళ్లలో భద్రతకు సబంధించిన అన్ని అంశాలనూ బలోపేతం చేయడం ద్వారా దేశ భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ అంతర్గత భద్రతను మరింత పటిష్ట పరిచేందుకు అనేక కీలక చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి దేశంలో శాంతిని కొనసాగించడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అజ్ఞాతంలో ఉంటూ కీలక సహకారం అందిస్తోందని ప్రశంసించారు.