మొదలుపెట్టింది. ఈ జలసంధిలోకి వచ్చే పౌర నౌకలను తనిఖీ చేయాలని నిర్ణయించింది.
చైనా చుట్టుపక్కల దేశాలతో జగడాలు పెట్టుకొంటూనే ఉంది. చిన్న చిన్న విషయాలను
సాకులుగా చూపించి అంతర్జాతీయ సరిహద్దులనే మార్చేయాలని చూస్తోంది. ఓ పక్క
ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచం సతమతమవుతుంటే మరోపక్క తైవాన్, అమెరికాతో
ఘర్షణకు డ్రాగన్ సిద్ధమవుతోంది. ఈ సారి ఏకంగా తైవాన్ జలసంధిని మింగేసేందుకు
యత్నాలు మొదలుపెట్టింది. అంతర్జాతీయ సరిహద్దులను దాటేందుకు యత్నిస్తోంది.
ఇటువైపు వచ్చే నౌకలపై పెత్తనం చేయడానికి యత్నిస్తోంది. అమెరికా, తైవాన్‌తో
ఘర్షణకు సిద్ధపడే చైనా ఈ ప్రయత్నాలు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.అసలేం జరిగింది..? : తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ సుదీర్ఘ పర్యటన
నిమిత్తం మార్చి 30న అమెరికా చేరుకొన్నారు. ఈ పరిణామాలతో చైనాకు పుండుమీద కారం
పూసినట్లయ్యింది. దీనికి తోడు ఆమెకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్
మెకార్థీ ఆతిథ్యమిచ్చారు. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికా గడ్డపై ఓ సీనియర్
నాయకుడు తైవాన్ అధ్యక్షురాలితో భేటీ కావడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలకు ఒక్క
రోజు ముందే చైనాలోని ఫుజియాన్ మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కీలక
నిర్ణయం తీసుకొంది. బుధవారం నుంచి తైవాన్ జలసంధిలో మూడు రోజులపాటు సంయుక్త
గస్తీలు, కార్గో, నిర్మాణరంగ నౌకలను తనిఖీలు చేయడం వంటి కార్యకలాపాలను
నిర్వహించాలని నిర్ణయించింది. ఈ జలసంధిలో చైనా-తైవాన్ సరిహద్దుగా గుర్తించే
‘మీడియన్ లైన్’ను దాటేసి మరీ ఈ తనిఖీలు చేపట్టాలని డ్రాగన్ నిర్ణయించింది.
ఈ రేఖ తూర్పు వైపు తైవాన్ పరిధిలోకి తమ నౌకలను పంపి ఆ ప్రదేశం తన ఆధీనంలో
ఉందని చెప్పడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన దాదాపు 10 చైనా
ఫైటర్జెట్లు కూడా ఈ మీడియన్ లైన్ దాటి వెళ్లాయి. చైనాకు చెందిన మారిటైమ్
ఫోర్స్ ఆధీనంలోని అతిపెద్ద సముద్ర గస్తీ నౌక హైక్సన్-06 రంగంలోకి దిగింది.
మరోవైపు తైవాన్ అధ్యక్షురాలితో భేటీకి వేదికైన రోనాల్డ్ రీగన్ లైబ్రరీపై,
హడ్సన్ ఇన్స్టిట్యూట్పై చైనా ఆంక్షలు విధించింది. దీంతోపాటు అమెరికాలో
తైవాన్ అనధికారిక ప్రతినిధి హ్సియో బిఖిమ్పై ఆంక్షలు విధిస్తున్నట్లు
ప్రకటించింది. ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు చైనా,
హాంకాంగ్, మకావ్లోకి అడుగుపెట్టకూడదు. ఈ తనిఖీల్లో పింగ్టన్ తైవాన్
డైరెక్ట్ కంటైనర్ రూట్, స్మాల్ త్రీ లింక్స్ ప్యాసింజెర్ రూట్,
వెస్సల్ రూట్ వంటివి ఉన్నాయి.
అసలేమిటీ మీడియన్ లైన్ : చైనా-తైవాన్ మధ్య జలసంధి విషయంలో తరచూ వివాదాలు
చెలరేగకుండా 1955లో అప్పటి అమెరికా ఎయిర్‌ఫోర్స్ జనరల్ బెంజిమన్ డేవిస్
జూనియర్ మీడియన్ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఇది తైవాన్ భూభాగానికి 40
కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మనం తైవాన్ విషయంలో నిత్యం వినే ఎయిర్
డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజెడ్) కంటే భిన్నమైంది. సాధారణంగా
తైవాన్ ఏడీఐజెడ్ చైనా భూభాగంపై కూడా ఉంటుంది. దీంతో తరచూ చైనా విమానాలు
దీనిలోకి చొరబడుతుంటాయి. కానీ, మీడియన్ లైన్ అలా కాదు. ఉద్రిక్తతలు బాగా
పెరిగిన సందర్భంలోనే చైనా నౌకలు, విమానాలు దీనిని దాటుతుంటాయి. కొన్ని
దశాబ్దాలపాటు చైనా-తైవాన్ మధ్య అనధికారిక సరిహద్దుగా ఇది కొనసాగుతూ
వస్తోంది. కాకపోతే ఇరు దేశాలు దీనిని అంగీకరిస్తున్నట్లు అధికారిక ప్రకటన
చేయలేదు. చైనాకు ఇది అదునుగా మారింది. కాలక్రమంలో డ్రాగన్ సైనిక పరంగా బలపడటం
మొదలుపెట్టాక ఈ రేఖను అసలు గుర్తించం పొమ్మంటూ కొత్త స్వరం అందుకొంది. అసలు
మీడియన్ లైన్ వంటిదేమీ ఉనికిలో లేదని చెబుతోంది. ఈ మేరకు 2020లో చైనా విదేశీ
వ్యవహారాల శాఖ ప్రతినిధి ప్రకటించారు.