మాదకద్రవ్యాలను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను బీఎస్ఎఫ్ ఎప్పటికప్పుడు
భగ్నం చేస్తూనే ఉంది. దీనిపై దాయాది దేశ అధికారి ఒకరు సంచలన విషయాలు
బయటపెట్టారు. భారత్ పై దాయాది పాకిస్థాన్ దుర్బుద్ధి ఆధారాలతో సహా
బయటపడింది. పాక్ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, మాదకద్రవ్యాల ను
అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పాక్ అధికారి ఒకరు
బట్టబయలు చేశారు. భారత్‌కు తాము డ్రోన్ల తో డ్రగ్స్‌ను స్మగ్లింగ్
చేస్తున్నది నిజమేనని స్వయంగా ప్రధాని సలహాదారే కెమెరా ముందు అంగీకరించినట్లు
తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ ప్రధాని
షెహబాజ్ షరీఫ్ కు రక్షణ సలహాదారుగా ఉన్న మాలిక్ మహమ్మద్ అహ్మద్ ఖాన్
ఇటీవల పాక్ జియో న్యూస్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు హమీద్ మీర్‌కు
ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన భారత్‌కు అక్రమంగా మాదకదవ్ర్యాల సరఫరాపై సంచలన
విషయాలను బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ను జర్నలిస్టు మీర్ తన
ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రధాని ప్రత్యేక సలహాదారు మాలిక్ సంచలన విషయం చెప్పారు. పాకిస్థాన్-భారత్
సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్లు హెరాయిన్‌ను సరఫరా
చేసేందుకు డ్రోన్స్‌ను ఉపయోగిస్తున్నారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ,
పునరావాసం కల్పించకపోతే వారు కూడా స్మగ్లర్ల ముఠాతో చేరే అవకాశముందని మాలిక్
చెప్పారని జర్నలిస్ట్ మీర తన ట్వీట్లో రాసుకొచ్చారు. భారత్‌కు డ్రగ్స్
స్మగ్లింగ్ జరుగుతుందా..? అని మాలిక్‌ను ప్రశ్నించగా.. ‘‘నియంత్రణ రేఖకు
సమీపంలో ఉన్న కాసౌర్ రేంజర్స్ ప్రాంతం. సరిహద్దు నిబంధనల కారణంగా ఈ ప్రాంతం
చాలా సున్నితమైంది. కానీ, దురదృష్టవశాత్తూ ఇక్కడ డ్రోన్లతో స్మగ్లింగ్
జరుగుతోంది. ఇటీవల రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు డ్రోన్లకు 10కేజీల
హెరాయిన్ చొప్పున కట్టి సరిహద్దు ఆవలకు విసిరేశారు. దీనిపై ఏజెన్సీలు
దర్యాప్తు చేస్తున్నాయని ఆయన చెప్పినట్లుగా వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో
వైరల్‌గా మారింది. జమ్మూకశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో తరచూ స్మగ్లర్లు
భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు, ఆయుధాలను తరలించేందుకు ప్రయత్నాలు
చేస్తున్న విషయం తెలిసిందే. సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉంటూ వారి
కుట్రలను భగ్నం చేస్తున్నాయి. పాక్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు
సైన్యం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది.