ఈ ఏడాది 106 మందికి పద్మ అవార్డులు
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన కేంద్రం
పలువురు తెలుగువారికి కూడా అవార్డులు
న్యూ ఢిల్లీ : ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన
106 మందికి కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించడం తెలిసిందే. ఆరుగురికి పద్మ
విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. భారత
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పద్మ
అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణకు చెందిన పసుపులేటి హనుమంతరావు (వైద్య
రంగం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం), ఏపీకి చెందిన కోటా సచ్చిదానంద
శాస్త్రి(కళలు), చింతలపాటి వెంకటపతిరాజు (కళలు) రాష్ట్రపతి చేతులమీదుగా
పద్మశ్రీ అందుకున్నారు. కాగా, రాష్ట్రపతి నుంచి పద్మ పురస్కారాలు స్వీకరించిన
గాయని సుమన్ కల్యాణ్ పూర్ కూడా ఉన్నారు. ఇక కాకినాడకు చెందిన డాక్టర్
సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ అందించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం
కృష్ణ పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. వ్యాపారవేత్త కుమారమంగళం బిర్లా
(పద్మ భూషణ్) కూడా పద్మ పురస్కారం స్వీకరించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర
మంత్రులు కూడా హాజరయ్యారు.