న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను
సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ
ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ చారణకు
వెళ్లిన ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు సిసోదియాను దాదాపు 8
గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకొని, అరెస్టు
చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం
అందించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో ఢిల్లీ పోలీసులు 144
సెక్షన్ విధించారు. విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో
సిసోదియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దినేశ్
అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన
ఫోన్ కాల్స్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అయితే, మనీశ్ సిసోదియా
సమాధానాలతో తృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని,
కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని
చెబుతున్నారు. సిసోదియా నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలంటే కస్టోడియల్
విచారణ అవసరమని అన్నారు.
మరోవైపు సీబీఐ విచారణకు ముందు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా చేసిన
ట్వీట్ సంచలనంగా మారింది. ‘‘నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి
హాజరవుతున్నా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. మరికొన్ని నెలలు జైలులోనే
ఉండాల్సి వచ్చినా లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని’’ అని
పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారని సిసోదియాకు ముందుగానే
అర్థమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిసోదియాను సీబీఐ గతంలోనూ విచారించింది.
దిల్లీ మద్యం కుంభకోణంలో సిసోదియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం
తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిసోదియా
సన్నిహితుడైన విజయ్ నాయర్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు అభిషేక్
బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, సమీర్ మహేంద్రు సహా ఏడుగురిని
నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అటు ఈ కేసులో
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది.
సిసోదియా అరెస్టు ఊహించిందే : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం
మనీశ్ సిసోదియాను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే
ఆయన్ను అరెస్టు చేస్తారని తమకు తెలుసని ఆప్ పేర్కొంది. సీబీఐ పూర్తిగా
కేంద్రం ఆదేశాల మేరకే పనిచేస్తోందని దుయ్యబట్టింది. మనీశ్‌ను అరెస్టు
చేస్తారని తమకు ఎప్పటినుంచో తెలుసని ఆప్ ఎమ్మెల్యే సురభ్ భరద్వాజ్ అన్నారు.
దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తాయో ముందే చెప్పగలిగే పరిస్థితులు ఉండటం
విచారకరమన్నారు.