న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. లిక్కర్
స్కామ్‌పై అన్నా చెల్లెలు ఇద్దరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన కేటీఆర్,
కవితలను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు
మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని
కిషన్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్
స్కామ్ చేయాలని చెప్పామా అంటూ ఆయన కేటీఆర్, కవిత లను ఉద్దేశించి
ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కల్వకుంట్ల ఫ్యామిలీకి
లేదన్నారు. లిక్కర్ స్కామ్‌పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నా నాటకాలు
ఆడుతున్నారని, సానుభూతి కోసమే బీఆర్ఎస్ డ్రామాలాడుతోందని కిషన్ రెడ్డి
చెప్పారు. మద్యం కేసు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చిందా అని
కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కవితను ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే భుజాలు ఎందుకు
తడుముకుంటున్నారని ప్రశ్నించారు. లక్షల విలువైన సెల్ఫోన్లను ఎందుకు ధ్వంసం
చేశారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ నేతలు టార్గెట్
చేయాల్సినంత గొప్పవాళ్లు కాదని కిషన్ రెడ్డి చెప్పారు. అక్రమ వ్యాపారంలో
ఇరుక్కుపోయి, అక్రమాలు చేస్తూ మోదీని తప్పుపడతారా అని కిషన్‌రెడ్డి ఎద్దేవా
చేశారు.
తెలంగాణ, మహిళల కోసమే.. కవిత లిక్కర్ వ్యాపారం చేశారా? : అబద్ధాలు ఆడటంలో
కల్వకుంట్ల కుంటుంబాన్ని మించిన వారు దేశ రాజకీయాల్లో ఎవరూ ఉండరని కేంద్ర
మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఢిల్లీ లో ఆయన మీడియాతో
మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ వ్యాపారం తెలంగాణ, మహిళల కోసమే చేశారా?
అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
అబద్ధాలు ఆడటంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారు దేశ రాజకీయాల్లో ఎవరూ
ఉండరు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా ఈరోజు కల్వకుంట్ల
కుటుంబం వ్యవహరిస్తోంది. నేను సీఎం కుమార్తెను.. నా మీద కేసు ఎట్లా పెడతారు?
నేనొక మహిళను, తెలంగాణ బిడ్డను అని కవిత అంటున్నారు. మీరు దిల్లీకి వెళ్లండి,
అక్కడ మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండని తెలంగాణ సమాజం
కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా? ఢిల్లీ వెళ్లి ఆప్‌తో కలిసి అక్రమంగా
మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ ఆడబిడ్డలు చెప్పారా? ఈరోజు తెలంగాణ ప్రజలు
కానీ, ఆడబిడ్డలు కానీ.. సీఎం కుమార్తె చేసిన పని కారణంగా సిగ్గుతో తలదించుకునే
పరిస్థితి ఏర్పడింది. మద్యం కుంభకోణంలో ఒక మహిళ ఉండటం నేనెప్పుడూ చూడలేదు.
ఇప్పటికే తెలంగాణను మద్యానికి అడ్డాగా మార్చారు. కేంద్రం గురించి కేటీఆర్,
కవిత అబద్ధాలు మాట్లాడారు. ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన పార్టీ మహిళా
రిజర్వేషన్ల గురించి మాట్లాడుతారా? ఈడీ నోటీసు రాగానే మహిళా రిజర్వేషన్
గుర్తుకు వచ్చిందా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.