వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
గుంటూరు : వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు
చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు పార్టీ న్యాయ విభాగం
క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, అనుబంధ విభాగాల
ఇంచార్జ్ వి విజయసాయిరెడ్డి కోరారు. తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పంచాయతి రాజ్, న్యాయ విభాగాల
అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్, పార్లమెంటరీ
పోలింగ్ బూత్ ఇంచార్జిలతో వేరు వేరుగా విజయసాయిరెడ్డి సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కొన్ని పత్రికలు మీడియా సంస్థలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అబద్ధాలను నిజాలుగా ప్రచారం
చేస్తున్నాయి. ప్రజల దృష్టిలో పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుంది.
న్యాయపరంగా దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో
మాదిరిగానే ఎన్నికల సమయంలో మన పార్టీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే పత్రాలు
నుంచి ప్రతి విషయంలోనూ న్యాయ విభాగం సహాయ సహకారాలు అందించాలని కోరారు.
వైయస్సార్ లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం నెలకు 5000 రూపాయలు
స్టైపండ్ ఇస్తుందని,అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి
తీసుకెళ్లాలని చెప్పారు. వివిధ విభాగాలకు సంబందించి కమిటీల నియామకం త్వరగా
పూర్తి చెయ్యాలని ఆయన కోరారు. పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి
నేతృత్వంలో న్యాయవిభాగ సమావేశం జరిగింది.