హైదరాబాద్ : ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు మీడియాకు ఉందని,
అదే సమయంలో సర్కారు చేస్తున్న మంచి పనులనూ ప్రోత్సహించాలని రాష్ట్ర పరిశ్రమలు,
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీరామారావు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మీడియా సంస్థలు
ప్రచారం చేయాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ
ఆధ్వర్యంలో మహిళా పాత్రికేయులను సత్కరించారు. పాలడుగు పద్మజ, గొర్లె
శ్రీసత్యవాణి, దాయన పద్మశ్రీ, తుమ్మల నాగిని, నీరుకొండ అనూష, చెరుకూరి
శాంతిశ్రీ (ఈనాడు), ఎం.స్వప్నప్రియ, ఎంకేడీ రాణి, షహీన్(ఈటీవీ
తెలంగాణ)లతోపాటు 138 మంది మహిళా జర్నలిస్టులు సత్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల
సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. త్వరలో వీహబ్ ద్వారా
రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో
19 వేల మంది పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చామని, గుజరాత్లో
మూడు వేల కార్డులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఎంత మంచిచేసినా దానికి
తగిన ప్రాధాన్యం ఉండడం లేదని, చిన్న తప్పు జరిగితే ఎక్కువగా చూపుతున్నారని
ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం కళ్లు
మూసుకుందనే కోణంలో నిందించడం సరికాదని, యంత్రాంగం పూర్తిస్థాయిలో
పనిచేస్తోందని చెప్పారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళలకు జర్నలిజం
వృత్తి కత్తిమీద సాములాంటిదన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టగానే గుండెల మీద కుంపటిగా భావించే రోజులు పోయాయని,
ప్రస్తుతం లక్ష్మీదేవిగా కొలుస్తున్నారని గుర్తుచేశారు. విద్యుత్తు శాఖ మంత్రి
జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఎక్కువ బాధ్యతలు ఇవ్వాలని నమ్మే ఏకైక
వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. సీఎస్ శాంతికుమారి మహిళా దినోత్సవ
శుభాకాంక్షలు తెలిపారు. సమాచార శాఖ కమిషనర్, పురపాలక ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి అర్వింద్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి తదితరులు
పాల్గొన్నారు.