కులగణనకు వెంటనే చట్టబద్ధత కల్పించాలి
కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక విధానం
కులగణన తీర్మానం కంటితుడుపు చర్య
బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలి
పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారు
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టిన వివరాలు గాంధీ కుటుంబం దాచిపెట్టుకుందా?
సీఎం రేవంత్ రెడ్డి సంకుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే ఉంటాం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ
హైదరాబాద్: తలాతోక లేని తీర్మానాన్ని ఆమోదించి కులగణనను ఏ విధంగా చేస్తారని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ? ఎలా చేస్తారు ? ఏ సంస్థ ద్వారా కులగణన చేయిస్తారు ? బడ్జెట్ లో అందుకు కేటాయించిన నిధులెంతా ? కులగణన లక్ష్యాలేంటి ? అన్న అంశాలపై ప్రభుత్వం తీర్మానంలో స్పష్టత ఇవ్వలేదని ఎండగట్టారు. కులగణన తీర్మానం కంటితుడుపు చర్యగా మభ్యపెట్టే విధంగా ఉందని ధ్వజమెత్తారు. తలాతోక లేని తీర్మానం చేయడం పట్ల తాము తీవ్ర నిరసన తెలియజేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం నాడు హైదరాబాద్ లో తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదన చారి, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
బీహార్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించి నిధులు కేటాయించడమే కాకుండా కులగణన పూర్తి చేయడానికి నిర్ణీత గడువును విధించాయని గుర్తు చేశారు. దాంతో బీహార్ లో బీసీల మొత్తం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం 75 శాతానికి పెంచగలిగిందని, ఎంబీసీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, బీసీలకు అదనంగా 28 శాతం కల్పించి 43 శాతానికి పెంచిందని వివరించారు. కాబట్టి బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలని, బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయించాలి సూచించారు. అందరికీ ఆరాధ్య దైవమైన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కు అతీగతీ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. కౌన్సిల్ లో తాము ప్రశ్నిస్తే కూడా మంత్రులు జవాబు చెప్పలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి బీసీ వ్యతిరేక చరిత్ర అని మండిపడ్డారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాదడారని చెప్పారు. 2011లో యూపీఏ ప్రభుత్వం రూ. 4500 కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేసిందని, కానీ నివేదిక మాత్రం బయటపెట్టాలని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తమ లాంటి వాళ్లం ప్రశ్నిస్తే బీసీలు ఇప్పుడే గుర్టోకొచ్చారా కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు, మరి రాహుల్ గాంధీకి బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా ? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతుండడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఒకే కుటుంబ దగ్గర ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్టారు. 2011లో దేశవ్యాప్తంగా చేపట్టి కులగణన వివరాలు గాంధీ కుటుంబం దాచిపెట్టుకుందా ? అని ప్రశ్నించారు. కులగణన చేసిన తర్వాత మూడేళ్ల పాటు యూపీఏ అధికారంలో ఉండిందని అయినా ఆ నివేదికను బహీర్గతం చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకుచితమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, బడ్జెట్ లో ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయించడం, కులగణన వంటి హామీలను గుర్తు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో యూత్, ఎస్సీ, ఎస్టీ, రైతు డిక్లరేషన్ల గురించి కూడా ప్రశ్నిస్తామని, కానీ బీసీ అంశాలు కాలపరిమితితో కూడడుకున్నవి కాబట్టి ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ,కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో లేదని, ఇంకా ప్రశ్నిస్తూ కాలయాపన చేస్తామనుకుంటే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. ప్రభుత్వం ఉన్నది పరిష్కరించడానికని, బీసీ అంశాలపై బీసీ నాయకులను పిలిచి మాట్లాడి పరిష్కార మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వానికి సూచన చేశారు.
అసెంబ్లీ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి మాట్లాడుతూ… బ్రిటీష్ హయాంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగిందని, కానీ స్వతంత్ర భారత దేశంలో వెనుకబడిన వర్గాల లెక్కలు తీయకపోడం దారుణమన్నారు. బీసీలకు రావాల్సిన న్యాయపరమైన వాటా రావాలని పదేపదే అడుగుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కులగణన తీర్మానానికి అన్ని పార్టీలు మద్ధతు పలికినా కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లడడం శోచనీయమన్నారు. కులగణనపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే కులగణన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ…. దేశంలో కులాలు, పరిపాలన, ఆత్మగౌరవం ప్రాధమిక హక్కుగా గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టింది కేవలం కేసీఆర్ యేనని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ అన్ని వర్గాలకు అన్యాయం చేశారని, సామాజిక కోణంలో ఆలోచించి బీసీలకు గణనీయమైన రాజకీయ అవకాశాలు ఇచ్చారని అన్నారు.
యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు మాట్లాడుతూ….. పూలేని గౌరవించాలన్న ఇగింత జ్ఞానం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం తీర్మానంలో లేదని చెప్పారు. మాటలు చెప్పి మభ్యపెట్టేలా తీర్మానం ఉందని ఆరోపించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని అన్నారు. కులగణనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు బొల్ల శివశంకర్, తాడూరి శ్రీనివాస్, రాజారాం యాదవ్, ఆలకుంట్ల హరి, కోల శ్రీనివాస్, ఆర్వీ మహేందర్
విజేందర్ సాగర్, ఏల్చల దత్తాత్రయ, గీతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.