గుజరాత్ ప్రచార సభలో రాహుల్
మహువా: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల
ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. రాష్ట్ర అధికార బీజేపీపై విమర్శలు
ఎక్కుపెట్టారు. ఆయన సూరత్ జిల్లాలోని మహువాలో జరిగిన భారీ బహిరంగ సభలో
గిరిజనులద్దేశిస్తూ ప్రసంగించారు. ‘బీజేపీ మిమ్మల్ని తాత్కాలిక వనవాసులు
అంటోంది. కానీ, గిరిపుత్రులే అడవికి అసలైన యజమానులు. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం
బడా పారిశ్రామికవేత్తలకు అటవీభూములను ధారాదత్తంచేస్తూ గిరిజనులను తమ అడవి
తల్లికి దూరంచేస్తోంది. ఇక్కడ మీ బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.
దీంతో ఆధునిక విద్య, వైద్యానికి మీ పిల్లలు దూరమవుతున్నారు. మీ పిల్లలు
ఇంగ్లిష్ మాట్లాడుతూ వైద్యులు, ఇంజనీర్లు, పైలట్లు కావడం బీజేపీ సర్కార్‌కు
ఇష్టంలేదని రాహుల్ దుయ్యబట్టారు. రాజ్‌కోట్‌లో జరిగిన మరో ర్యాలీలో ఆయన
పాల్గొన్నారు.
బీజేపీతోనే రైతులకు కష్టాలు
మహారాష్ట్రలో కర్షకులు, యువత, గిరిజనులను పట్టిపీడిస్తున్న కష్టాలకు అసలు
కారణం బీజేపీయేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో 380
కిలోమీటర్ల పొడవునా కొనసాగిన భారత్ జోడో యాత్రనుద్దేశిస్తూ రాహుల్ ఒక
ప్రకటన విడుదలచేశారు. పంటల బీమా పథకాల వైఫల్యం కారణంగా రైతులు కష్టాలు
పడుతున్నారని వాపోయారు.