కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిశోర్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద 71.24కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావచ్చని కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ పట్టణంలో పార్కులు అభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు, నీటి సరఫరాకు 3 ప్రాజెక్టులు, సీవేజ్, సెప్టేజ్ నిర్వహణకు 2 ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. పార్క్‌ల అభివృద్ధికి కేటాయించిన నాలుగు ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు పూర్తికాగా మరో ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్ట్ ఖరారైనట్లు తెలిపారు అలాగే నీటి సరఫరాకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు పూర్తికాగా మిగిలిన రెండు ప్రాజెక్టులకు కాంట్రాక్ట్ ఖరారు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు భూసేకరణలో జాప్యం, కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావచ్చని మంత్రి తెలిపారు