సెలవులకు చెన్నై వెళ్లేదాన్ని
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం వాషింగ్టన్లో ఇచ్చిన విందు
సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారత్‌తో ఉన్న అనుబంధాన్ని
గుర్తు చేసుకున్నారు. ‘నా చిన్నతనంలో నన్ను, నా సోదరి మాయాను మా అమ్మ
సెలవులప్పుడు భారత్‌కు తీసుకెళ్లేది. చెన్నైలో మా అమ్మమ్మ తాతయ్యలను చూడటానికి
మేము వెళ్లేవాళ్లం. మా అంకుల్, ఇతర బంధువులనూ కలిసేవాళ్లం. అక్కడ లభించే మంచి
ఇడ్లీలంటే నాకెంతో ఇష్టం. నా జీవితంలో నాకెంతో ఇష్టమైన వ్యక్తి మా అమ్మమ్మ.
మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. నాకు ఊహ తెలిసినప్పుడు మా తాతయ్య
సివిల్ సర్వెంట్‌గా తన వృత్తి నుంచి రిటైరయ్యారు. ఆయన రోజూ ఉదయం తన
స్నేహితులతో బీచ్‌లో నడిచేవారు. దేశంలో ఉన్న ఆనాటి సమస్యలపై చర్చించేవారు.
నేను ఆయన చేయిపట్టుకుని నడుస్తూ వారి మాటలు ఆసక్తిగా వినేదాన్ని. స్వాతంత్య్ర
పోరాట యోధుల గురించి, దేశ నిర్మాతల గురించి ఆయన చెప్పేవారు. ఒకరి విశ్వాసం,
కులంతో సంబంధం లేకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం, సమానత్వం కోసం పాటుపడటం
గురించి వారు మాట్లాడటం నాకింకా గుర్తుంది. ఆ సంభాషణలు నా ఆలోచనలను ప్రభావితం
చేశాయి. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం మా తాత
పి.వి.గోపాలన్, అయన కుమార్తె అయిన మా అమ్మ శ్యామల నుంచి నేర్చుకున్న పాఠాలే.
మా తాత నాకు పాఠాలు బోధించడమే కాదు.. ప్రజాస్వామ్య అర్థం తెలిపి దానికి
కట్టుబడి ఉండటం నేర్పారు. చిన్న వయసులో నేను నేర్చుకున్న పాఠాలే నన్ను
ప్రజాసేవవైపు నడిపించాయి. ఈ రోజు మీ ముందు అమెరికా ఉపాధ్యక్షురాలిగా నిలబడేలా
చేశాయని ఆమె తెలిపారు.
‘అమెరికాలో భారతీయులు అసాధారణ ప్రభావం చూపుతున్నారు. ఉదాహరణకు భారతీయ వారసత్వం
కలిగిన అమెరికా కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను తీసుకోండి. ఎంతోమంది చట్టసభల్లో
సభ్యులుగా ఉన్నారు. భారతీయ అమెరికన్ల ప్రభావం, అమెరికన్ కంపెనీల నుంచి పొరుగు
వ్యాపారాల వరకు, హాలీవుడ్ స్టూడియోస్ నుంచి దేశవ్యాప్తంగా యూనివర్సిటీ
రీసెర్చ్ ల్యాబ్‌ల వరకూ వ్యాపించింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా నేను
ప్రపంచమంతటా తిరిగా. భారతదేశ చరిత్ర, బోధనలు నన్ను మాత్రమే కాదు మొత్తం
ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం,
ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది
ప్రజలను ప్రేరేపించింది’ అని కొనియాడారు. భారత్‌ను ప్రపంచ శక్తిగా
మార్చినందుకు ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు క్వాడ్‌ను
పునరుద్ధరించడానికి సహాయం చేశారు. జీ-20లో మీ నాయకత్వం కొత్త పురోగతిని
సాధిస్తోంది. ప్రపంచ సవాళ్లకు పరిష్కార మార్గాలు తెలియజేసే అంతర్జాతీయ సంస్థల
ప్రతిపాదకులుగా మీరు వ్యవహరిస్తున్నారు. మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు
ఆర్టెమిస్‌లో చేరాలని కోరాను. దాన్ని మీరు అంగీకరించినందుకు నేను
సంతోషిస్తున్నానని కమలా హారిస్ పేర్కొన్నారు.
భారతీయుల కృషి అద్భుతం : విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్
అమెరికాలో భారతీయుల కృషి అద్భుతమని విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్
కొనియాడారు. తమిళనాడు నుంచి వచ్చిన కమలా హ్యారిస్ తల్లి శ్యామల క్యాన్సర్‌పై
పరిశోధన చేశారని తెలిపారు. కేవలం 14 అమెరికా డాలర్లు జేబులో పెట్టుకుని వచ్చిన
వ్యక్తి కుమారుడు భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితుడైన తొలి భారతీయ
అమెరికన్‌గా చరిత్ర సృష్టించారని వెల్లడించారు. ప్రస్తుతం రిచర్డ్ వర్మ
విదేశాంగశాఖ ఉప మంత్రిగా (మేనేజ్మెంట్, రిసోర్సెస్) పని చేస్తున్నారని
తెలిపారు. ఈ శాఖ చరిత్రలో ఇదే ఒక భారతీయ అమెరికన్ చేపట్టిన అత్యున్నత పదవని
చెప్పారు.
మహిళలకు కమలా హారిస్ స్ఫూర్తి : ప్రధాని నరేంద్ర మోడీ
కమలా హారిస్ సాధించిన విజయాలు మహిళలకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని నరేంద్ర
మోడీ పేర్కొన్నారు. తనకు విందు ఇచ్చిన ఆమెకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన మాట్లాడారు.
‘మీ విజయాలు భారత్, అమెరికాల్లోనే కాకుండా ప్రపంచంలోని మహిళలందరికీ
స్ఫూర్తిదాయకం. మీ తల్లి శ్యామల 1958లోనే అమెరికాకు వచ్చారు. అప్పట్లో ఫోన్లు
లేకపోవడంతో ఆమె తన తల్లిదండ్రులకు లేఖలు రాసేవారు. అంతేతప్ప భారత్‌లోని తన
బంధువులతో సంబంధాలను వదులుకోలేదని ప్రశంసించారు.