గుంటూరు : తెలుగు రాష్ట్రాల్లో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సేవలను
మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు.
2023-25 కాలానికి తానా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన
భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ‘ఉచిత కంటి వైద్యం, క్యాన్సర్ శిబిరాలను
ఏర్పాటు చేస్తాం. రైతులకు అవసరమైన పరికరాలు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు,
మహిళలకు కుట్టుమిషన్లు, వికలాంగులకు మూడుచక్రాల సైకిళ్లను పంపిణీ చేస్తాం.
అమెరికాలోని తెలుగు సమాజంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వారికి సహాయ సహకారాలు
అందిస్తాం’ అని వివరించారు.
బీమా సౌకర్యం కల్పించడమే లక్ష్యం: కార్యదర్శి అశోక్
అమెరికా వచ్చే విద్యార్థులు, ప్రవాసుల తల్లిదండ్రులకు ఆరోగ్యబీమా సౌకర్యం
కల్పించడమే తన లక్ష్యమని తానా కార్యదర్శిగా నియమితులైన అశోక్ కొల్లా
చెప్పారు. ‘అమెరికా వచ్చే తెలుగు విద్యార్థులు 250 డాలర్లు చెల్లిస్తే చదువు
పూర్తయి ఉద్యోగం వచ్చే వరకు ఆరోగ్య బీమా కల్పించడం ద్వారా తానాను వారికి మరింత
దగ్గర చేయవచ్చు. అమెరికా పర్యటనకు వచ్చే ప్రవాసుల తల్లిదండ్రులకు 6 నెలల పాటు
ఆరోగ్య బీమా సౌకర్యం అందించాలనేది నా దీర్ఘకాల ఆశయం’ అని తెలిపారు. ‘అమెరికా,
కెనడాల్లోని తానా సభ్యుల సమన్వయంతో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కట్టే
కార్యక్రమాల నిర్వహణ, తానా టీంస్క్వేర్ కార్యకర్తల సంఖ్య పెంపుపై దృష్టి
సారిస్తా’ అని వివరించారు. తానా మ్యాట్రిమోనీ సేవలను విస్తృతం చేసి, ఒక
ఆరోగ్యకరమైన వేదికగా తయారు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెం
గ్రామానికి చెందిన అశోక్ తానాలో వివిధ పదవులు నిర్వహించారు.