తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన (ఆలయ శుద్ధి) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుభ్రం చేశారు. శ్రీవారి మూలమూర్తిని పూర్తిగా వస్త్రంతో కప్పివుంచి శుద్ధి చేసిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, కిచిలీగడ్డ, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేశారు. తర్వాత మూలవిరాట్టుకు కప్పిన వస్ర్తాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించాక భక్తులను దర్శనానికి అనుమతించారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ , బోర్డు సభ్యులు మధుసూదన యాదవ్, అదనపు ఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్, ఆలయ డిప్యూటీఈవో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.