గుజరాత్ తీగల వంతెన దుర్ఘటనలో ఎన్నో లోపాలు వెలుగుచూస్తున్నాయి. అలాగే నదిలో మునిగిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మోర్బీ: గుజరాత్ తీగల వంతెన విషాదంలో ఇంకా ఎంతమంది గల్లంతయ్యారనే దానిపై స్పష్టత లేదు. ‘కనీసం ఇద్దరి ఆచూకీ లేదని మేం అంచనా వేస్తున్నాం. ఆ సంఖ్య ఎక్కువగా కూడా ఉండొచ్చు. దానిపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ చాలామంది తమ బంధువులు జాడలేదని చెప్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాం. స్కూబా డైవర్లను దింపాం. నదిలో పడిన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించేందుకు సోనార్ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం’ అని స్టేట్ ఫైర్ సర్వీసెస్ చీఫ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనలో ఎన్నో లోపాలు వెలుగుచూస్తున్నాయి. వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు కోర్టుకు సమర్పించారు.
* 143 ఏళ్ల బ్రిడ్జ్‌కు మరమ్మతు చేసేముందు ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు. నాసిరకం పదార్థాలు వాడారు.
* ప్రమాద సమయంలో వంతెనలో తెగిన తీగలతో సహా మరెన్నో తీగలకు తుప్పు ఉంది.
* మరమ్మతుల సమయంలో ఫ్లోరింగ్‌ను మాత్రమే మార్చి, తీగలను వదిలేశారు. వాటిని సరిచేసి ఉంటే ఈ దుర్ఘటన చోటుచేసుకునేది కాదు.
* ఈ పనిలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు నిర్మాణ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. కేవలం రంగులేసి, పాలిష్ చేశారు.
* ఆ బ్రిడ్జ్‌ను పున: ప్రారంభించే సమయంలో ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకోలేదు. అలాగే దానిమీద ఎంతమంది ప్రయాణించవచ్చో నిర్ధారించలేదు. తక్షణ సహాయచర్యలకు ఎలాంటి ఏర్పాట్లు లేవు.
* ఆ సంస్థ మరమ్మతులు పూర్తిచేసేందుకు డిసెంబర్ వరకు గడువు ఉంది. కానీ దీపావళి, గుజరాత్ కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తారనే అంచనాతో దాన్ని ముందుగానే తెరిచారు.