అమరావతి : మాండస్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు
తీవ్రంగా నష్టపోయారని, తుఫాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన ఇక్కడ
మీడియాతో మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం అందించాలని, పాడైపోయిన పంటలను
ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రైతుల
సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని విమర్శించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అందించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం
వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను ఎన్యూమరేషన్ (పంట
నష్టాన్ని అంచనా) చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ అన్నమయ్య డ్యామ్
బాధితులకు ప్రభుత్వం నయాపైసా సాయం అందించలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో నడిరోడ్డున పడిన కుటుంబాలకు ఆశ్రయం
కల్పించలేదని, ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడాన్ని
తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన నాటి నుంచి వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అచ్చెన్నాయుడు
ఆరోపించారు.