ఆ సంస్థకు కీలకంగా మారిన ఆయిల్బ్లాక్గా మారిన ఈస్ట్రన్ ఆఫ్‌షోర్
ఓడలరేవు టెర్మినల్‌లో రూ.53 వేల కోట్ల పెట్టుబడి
సముద్ర గర్భంలో పూర్తయిన 300 కిలోమీటర్ల పైప్‌లైన్
రెండేళ్లలో 1.22 లక్షల మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు
ఉత్పత్తే లక్ష్యం
కాకినాడ : కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అతిపెద్ద ఆయిల్ బ్లాక్‌గా ఉన్న
‘ఈస్ట్రన్ ఆఫ్‌షోర్’(తూర్పు తీరం)పై పట్టు సాధించే దిశగా ఓఎన్జీసీ అడుగులు
వేస్తోంది. రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో
పోటీపడి.. నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఈస్ట్రన్ ఆఫ్ షోర్లో
డ్రిల్లింగ్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తోంది.
తొలి దశలో భాగంగా ఇక్కడ చమురు, సహజవాయువు అన్వేషణ కోసం రూ.53 వేల కోట్ల
పెట్టుబడి పెట్టింది. కాకినాడలోని ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ కేంద్రానికి 50
కిలోమీటర్ల దూరంలోని అల్లవరం మండలం ఓడలరేవులో 300 ఎకరాల్లో భారీ టెరి్మనల్‌ను
ఏర్పాటు చేసింది. ఈ టెరి్మనల్ ద్వారా రోజుకు 15 వేల మిలియన్ స్టాండర్డ్
క్యూబిక్ మీటర్ల సహజవాయువు, 78 వేల బ్యారెల్స్ క్రూడ్ వెలికితీయాలని
లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఓడలరేవు టెర్మినల్‌తో పాటు యానాం సమీపంలోని
గాడిమొగలో ఉన్న గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ టెరి్మనల్‌ను టేకోవర్ చేసి
ఈస్ట్రన్ ఆఫ్‌షోర్‌లో విలీనం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర గర్భంలో
425 కిలోమీటర్ల పైప్‌లైన్ చేపట్టాలి. ఇప్పటికే ఆఫ్‌షోర్‌లో డ్రిల్లింగ్
పూర్తయిన బావులను అనుసంధానిస్తూ 300 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణాన్ని
దాదాపు పూర్తి చేసినట్లు ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు డ్రిల్లింగ్
ప్రక్రియను పూర్తి చేసిన 45 బావులలో సహజవాయువును వెలికి తీస్తున్నారు. ఈ బావుల
నుంచి రోజుకు 35 వేల బ్యారెల్స్ క్రూడ్, సహజవాయువు ఉత్పత్తిని ఓఎన్జీసీ
ప్రారంభించింది.
భారీ లక్ష్యంతో ముందుకు …
ఇప్పటివరకు కేజీ బేసిన్లో రాజమండ్రి అసెట్ కేంద్రంగా కార్యకలాపాలు
నిర్వహిస్తూ వచి్చంది. అక్కడ నిల్వలు నిండుకోవడంతో ఇదే బేసిన్‌లోని
ఆఫ్‌షోర్‌లో రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో
పోటీపడుతోంది. ఆ సంస్థలకు ధీటుగా విదేశీ పరిజ్ఞానంతో రికార్డు స్థాయిలో
1,45,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలను ముమ్మరం చేసింది. సహజంగా
తీరం నుంచి 80 మీటర్ల వరకు డ్రిల్లింగ్ నిర్వహిస్తారు. ఈ బ్లాక్‌లో నార్తరన్
డిస్కవరీ ఏరియాలో 1,800 మీటర్లు, సదరన్ డిస్కవరీ ఏరియాలో 3,100 మీటర్ల లోతున
డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. డ్రిల్లింగ్ పూర్తయిన 45 బావుల నుంచి ఉత్పత్తి
ప్రారంభించేందుకు వీలుగా ఫ్లోటింగ్ ప్రొడక్షన్ స్టోరేజ్, లోడింగ్
ఫ్లాట్ఫార్మ్లను అభివృద్ధి చేసింది. ఈ బేసిన్లో నిర్వహిస్తోన్న
డ్రిల్లింగ్‌తో 2024 నాటికి 1.22 లక్షల మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల
గ్యాస్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఓఎన్జీసీ ముందుకెళ్తోంది.