ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నిర్మల్ : రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే
ఎన్నికల్లో తరిమి కొట్టి పేదల రాజ్యం తీసుకొద్దామని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామయాత్ర నిర్మల్ జిల్లా భైంసా
శివారు నుంచి వాడిపెల్లి క్రాస్‌రోడ్, గుండేగాం, మహాగాం, మహాగాం తండా, చాత
మీదుగా లింబా-బి వరకు సాగింది. పల్సి రంగారావు జలాశయ ముంపు గ్రామమైన
గుండేగాంలో సంజయ్ రచ్చబండ నిర్వహించి మాట్లాడారు. రాత్రి భైంసా మండలం
మహాగాంలో బుధవారం రాత్రి జరిగిన సభలోనూ ప్రసంగించారు. గుండేగాంలో ముంపు
బాధితులు తమ గోడు వెల్లడించగా.. ‘మీ పరిస్థితి చూస్తుంటే గుండె
తరుక్కుపోతోంది.. ఊరు మునిగిపోతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం
లేదు? 250 కుటుంబాలను ఆదుకోని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు?
వానొస్తే తెరాస నేతలను ఇక్కడికి తీసుకొచ్చి కట్టేయండి.. అప్పుడే వారికి మీ బాధ
తెలుస్తుంది. ఏడేళ్లుగా మీ బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే
మీకు అవసరమా?’ అని ప్రశ్నించారు.
తాము వస్తున్నామని తెలిసి గ్రామంలో సర్వే చేశారని, జీవో మంజూరు కాగితాలు,
చెక్కులు ఇచ్చి చప్పట్లు కొట్టించుకుని మళ్లీ కనిపించకుండా పోతారని అన్నారు.
ఇక్కడ ముంపు పరిహారం చెల్లించలేని కేసీఆర్ పంజాబ్ వెళ్లి ఒక్కో రైతుకు రూ.3
లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. చింతమడకలో ఇంటింటికీ రూ.10 లక్షలు ఇచ్చిన సీఎం
గుండేగాం వాసుల కష్టాలు తీర్చకపోవడం బాధగా ఉందన్నారు. కేసీఆర్‌కు పేదలంటే మంట
అని, కేసులు పెట్టి వేధిస్తూనే ఉంటారన్నారు. తాము పేదల వెంటే ఉంటామని జైళ్లు,
పోలీసుల దెబ్బలు కొత్తకాదని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో
వస్తుందని, ఆ తర్వాత ఆయన సంగతి చూస్తామన్నారు.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి : స్థలం ఉన్న వాళ్లందరికీ ఇంటి
నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్
మాట తప్పి రూ.3 లక్షలే ఇస్తామంటున్నారని బండి సంజయ్ మహాగాం సభలో అన్నారు.
స్థలం ఉన్న వారందరికీ డబ్బులిచ్చే వరకు వదలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే ఆ
సొమ్మును కేసీఆర్ దారి మళ్లించారని ఆరోపించారు.