మూడు నెలలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళన
గురువారం టీఎస్ పీఎస్ సీ కార్యాలయ ముట్టడి
సీఎస్ శాంతికుమారికి దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్
టీఎస్ పీఎస్ సీతో చర్చించి కీలక నిర్ణయం ప్రకటించిన సీఎస్
హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష
వాయిదా పడింది. ఈ పరీక్షను నవంబరులో నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షను 3
నెలలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు గురువారం నాడు టీఎస్ పీఎస్ సీ కార్యాలయాన్ని
ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ
నేపథ్యంలో సీఎం కేసీఆర్ సీఎస్ శాంతికుమారితో చర్చించారు. గ్రూప్-2 పరీక్ష
నిర్వహణపై టీఎస్ పీఎస్ సీతో చర్చించాలని సూచించారు. మున్ముందు విడుదల చేసే
నోటిఫికేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అనంతరం
సీఎస్ శాంతికుమారి టీఎస్ పీఎస్ సీ చైర్మన్, సెక్రటరీతో సమావేశమై సీఎం కేసీఆర్
సూచించిన మేరకు చర్చలు జరిపారు. ఆపై, గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు
ప్రకటించారు. ఇటీవల వరుసగా పోటీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో, తాము ఏ పరీక్షకు
కూడా సరిగా సన్నద్ధం కాలేకపోతున్నామన్నది తెలంగాణ నిరుద్యోగుల వాదన. ఈ
కారణంగానే వారు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గురుకుల ఉపాధ్యాయ పరీక్షలు ఈ నెల 21 వరకు జరగనుండగా, జూనియర్ లెక్చరర్ నియామక
పరీక్షలు వచ్చే నెల 12 నుంచి అక్టోబరు 3 వరకు నిర్వహించనున్నారు. ముందు
నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరున గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాల్సి
ఉంది. అయితే సీఎం కేసీఆర్ జోక్యంతో పరీక్షలు వాయిదా వేశారు.