కుమార్తెతో కలిసి సీతారామచంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
భద్రాచలం : కుమార్తెతో కలిసి భద్రాచలం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌లు స్వాగతం పలికారు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌లు పట్టువస్త్రాలు బహూకరించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి సీతారాముల చిత్రపటాన్ని మంత్రి అజయ్ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతి కలిగించిందన్నారు. తెలంగాణలో పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందని తెలిపారు. భద్రాచలంలో సుమారు 3 గంటల పాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగింది. రాష్ట్రపతి హోదాలో సర్వేపల్లి రాధాకృష్ణన్, శంకర్‌దయాళ్ శర్మలు గతంలో భద్రాచలం పర్యటనకు వచ్చారు.