హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తుకారాంగేట్‌కు చెందిన ఆర్.సామ్రాట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గత నెల 24వ తేదీన జూబ్లీహిల్స్‌లో సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అక్కడున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ పార్టీ వార్ రూమ్‌పై ఎలా దాడి చేస్తారని పోలీసులను నిలదీసింది. దీంతో సీజ్ చేసిన ఆ కార్యాలయ తాళాలు తిరిగి ఇచ్చేసిన పోలీసులు ఆ ముగ్గురు ఉద్యోగులకు సీఆర్పీసీ 41ఎ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తాజాగా సైబర్ క్రైం పోలీసులు సునీల్ కనుగోలుకు నోటీసు ఇచ్చేందుకు వెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి నోటీసు తీసుకున్నారు. పది ప్రశ్నలతో కూడిన నోటీసుకు వివరణతో 30వ తేదీన ఉదయం 11 గంటలకు సైబర్ క్రైం కార్యాలయంలో హాజరుకావాలని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఒకవేళ హాజరు కానట్లయితే సీఆర్పీఎస్ 41ఎ కింద అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.