భాష, సాహిత్యము, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రాంత అభివృద్ధి కోసం సురవరం
ప్రతాపరెడ్డి కృషి ఎనలేనిది
సురవరం ప్రతాప్ రెడ్డి 127 వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి.
శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన నివాళులు
హైదరాబాద్ : తెలంగాణ వైతాళికులు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం
ప్రతాప్ రెడ్డి 127 వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి.
శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై
ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి
చెందిన వైతాళికులు, కవులు, సాహితివేత్తలు, కళాకారులు, సామాజిక వేత్తలను
గుర్తించి వారి జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. వారు
అందించిన సేవలను భవిష్యత్తు తరాలకు తెలియచెప్పేలా అధికారికంగా రాష్ట్ర
ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను
నిర్వహిస్తుందని మంత్రులు ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ వైతాళికులు,
సాహితీవేత్త, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి గారు
అందించిన సేవలను ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు స్మరించుకున్నారు. ఈ
కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు తెలంగాణ సాహిత్య పరిషత్
ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
సాంఘీక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్థి సురవరం : భాష, సాహిత్యము, సాంస్కృతిక
పునరుజ్జీవనం, ప్రాంత అభివృద్ధి కోసం సురవరం ప్రతాపరెడ్డి కృషి ఎనలేనిదని,
భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. సాహిత్యం నుంచి సైన్స్ వరకు సురవరం
స్పృశించని అంశం లేదని మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ చైతన్యానికి ఆయన గొప్ప స్ఫూర్తి. కేంద్ర
సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగువ్యక్తి. సురవరం సాహిత్యం ఒక మాటలో,
ఒక ఉపన్యాసంలో వర్ణించలేము. ఏకకాలంలో దళిత సంఘాలకు, వైశ్య సంఘాలు.. భిన్నమైన
సామాజిక వర్గాలకు గౌరవ అధ్యక్షులుగా పని చేశారు. తొలిసారి వనపర్తి
శాసనసభ్యులుగా ఎన్నికై కేవలం 12,13 మాసాలలోనే మరణించడం దురదృష్టకరం. సురవరం
జీవిత చరిత్ర మూడో తరానికి తెలియాలని, ఆయన కీర్తి పతాక చిరస్థాయిగా వెలగాలనే
ఆకాంక్షతో ఆయన విగ్రహాన్ని వనపర్తిలో ఆవిష్కరించాం. ఆయన చేసిన సేవలు మరింత
ప్రాచుర్యంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఆయన రచనలను రెండు సంపుటాలుగా
తీసుకొచ్చాం. మూడో సంపుటాన్ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తీసుకొస్తాం.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు, వనపర్తి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ
గుర్తుండి పోతాయన్నారు.