హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్ని వర్గాల ప్రజల భద్రత,
సంక్షేమం, సముద్ధరణకు అంకితభావంతో ముందుకు సాగుతున్నరని రాజ్యసభ సభ్యులు
వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సుపరిపాలన
అందిస్తున్నారని,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ప్రజలందరు సుఖ
సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో తమను బీసీ జాబితాలో
తిరిగి చేర్చాలని, న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలంటూ కర్ణాటక ప్రదేశ్ బలిజ
సంఘం శుక్రవారం సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభకు ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్సీ
పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్, మరికల్ పోత సుధీర్ కుమార్,
ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్ లతో కలిసి అతిథిగా హాజరై సంఘీభావం
తెలిపారు. ఈ సభలో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, తెలంగాణ ఒక మినీ ఇండియాగా
వెలుగొందుతున్నదని, దేశవిదేశాలకు చెందిన వివిధ జాతులు, మతాలు,భాషల వాళ్లు
స్వేచ్ఛగా జీవిస్తున్నారని రవిచంద్ర వివరించారు. సుస్థిర పాలనా వ్యవస్థ,
శాంతిభద్రతలు సజావుగా ఉండడంతో బహుళజాతి సంస్థలు తెలంగాణలో పెద్ద ఎత్తున
పెట్టుబడులు పెడ్తున్నాయని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే
యువతకు రూ. 20లక్షలు ఉచితంగా అందిస్తున్న మహానేత కేసీఆర్ అని రవిచంద్ర
కొనియాడారు. మున్నూరుకాపులకు సముచిత పదవులిచ్చి గౌరవిస్తున్నారంటూ బీసీ
సంక్షేమ శాఖను గతంలో జోగు రామన్న, ఇప్పుడు గంగుల కమలాకర్ లకు కేటాయించడాన్ని
గుర్తు చేశారు. హైదరాబాద్ మహానగర మేయర్ గా మొదట బొంతు రాంమోహన్, ఇప్పుడు
గద్వాల విజయలక్ష్మీలను నియమించారని, రాజ్యసభకు కేశవరావు,తనను ఎంపిక చేయడం
జరిగిందని వివరించారు. ఇదేవిధంగా చెప్పుకుంటూపోతే స్థానిక సంస్థలలో సింహభాగం
పదవులు మున్నూరుకాపులకే కేటాయించారని తెలిపారు.బీసీ కులాల ఆత్మ గౌరవాన్ని
పెంపొందించుకునేందుకు గాను విలువైన భూములతో పాటు కోట్ల రూపాయలు కేటాయించడం
జరిగిందన్నారు. కర్ణాటకలో బలిజలు గణనీయ సంఖ్యలో ఉన్నారని, రాష్ట్రాభివృద్ధిలో
వీరి పాత్ర ప్రముఖమైందని, అయితే అత్యధికులు పేదలేనన్నారు. బీసీలుగా ఉన్న
వీరిని 1984లో ఆ జాబితా నుంచి తొలగించడం తీవ్ర విచారకరమన్నారు. తమను బీసీ
జాబితాలో తిరిగి చేర్చాలని, చట్టసభల ఎన్నికలలో సముచిత సంఖ్యలో సీట్లు ,
నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో తగు ప్రాధాన్యతనివ్వాలన్న బలిజల డిమాండ్స్
న్యాయమైనవని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఈ డిమాండ్స్ సాధనకు తమ బీఆర్ఎస్ సంపూర్ణ
మద్దతునిస్తుందని, ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెంటనే సానుకూలంగా స్పందించి
న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.తమ సంకల్ప సభకు సంఘీభావం తెలిపి,బీఆర్ఎస్
పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించిన, అమూల్యమైన సందేశమిచ్చిన ఎంపీ రవిచంద్రకు
కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘం ప్రముఖులు ఎం.ఆర్.జయరాం, సీతారామయ్య తదితరులు
హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.