విజయవాడ : తెలుగుదేశం నిన్న విశాఖలో ప్రకటించిన విజన్ 2047 వినాశకరమైనదని,
రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేది కాదని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు విమర్శించారు. విజన్ 2020 తర్వాత వ్యవస్థ సంక్షోభాన్ని
ఎదుర్కొంటున్నదని, ఆర్ధిక అసమానతలు, నిరుద్యోగం పెరిగాయని అయినా పాలకులు పాఠం
నేర్చుకోవడం లేదని అన్నారు. విజన్ 2047ని కొత్త సీసాలో పాత సారా కింద ఆయన
అభివర్ణించారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ జిల్లా కమిటీ సమావేశంలో
ప్రసంగిస్తూ రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. ప్రత్యేక హోదా
ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని
ప్రైవేటీకరిస్తూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తుంటే వైసీపీ, టిడిపిలు ఎలా
బలపరుస్తున్నాయని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో
తీసుకెళ్తానంటూ వాగ్దానాలు చేసే చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ విధానాలను అమలు
చేయాలని, విద్యాసంస్థలను కుదించాలని, విద్యుత్ సంస్కరణలను కొనసాగించాలని తన
విజన్ 2047లో చెప్పటం ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం
కలిగిస్తుందని చెప్పారు. పి4 విధానంలో ప్రజల పాత్ర ఒక భ్రమ అని, సహజవనరులను
దోచుకోవడానికే పి4 విధానం తోడ్పడుతుందన్నారు.
వైయస్సార్ పార్టీ విధానాలు రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశాయని, దానికి
ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని చెబుతున్న
చంద్రబాబు నాయుడు గత విధానాలనే అనుసరించటం, అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో
చెప్పాలన్నారు. బిజెపి కేంద్రంలో అనుసరించే విధానాలనే రాష్ట్రంలో
వైఎస్ఆర్సిపి అనుసరిస్తున్నది. ఈ రెండు విధానాలకు తెలుగుదేశం ప్రకటించిన
విజన్ ఏ మాత్రం భిన్నంగా లేదు. గతం నుండి పాఠాలు నేర్చుకోకుండా, పాచిపోయిన
పాత విధానాలనే అమలు చేసి రాష్ట్రాన్ని సుడిగుండంలోకి నెట్టవద్దని, తన
విధానాలపై పునరాలోచన చేసి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, యువతరం
భవిష్యత్తుకి తోడ్పడేటువంటి ప్రత్యామ్నాయ విధానాలు తీసుకోవాలని, ప్రపంచంలో
మారుతున్న కొత్త పరిస్థితులను అధ్యయనం చేయాలని శ్రీనివాసరావు సూచించారు.
రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపిని మట్టి కరిపించాలని, బిజెపిని
ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరిచే మిత్రులకు కూడా మద్దతు ఇవ్వొద్దని ఆయన
ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో సిపిఐ(ఎం) ప్రజా పునాదిని
విస్తరించుకోవటానికి, పార్టీ బలపడటానికి కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశానికి
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు, వై.వెంకటేశ్వరరావు
హాజరయ్యారు.