ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుతరాలకు అందజేయటమే వారికిచ్చే నిజమైన నివాళి
ఎన్టీఆర్ నటుడిగా కష్టపడి, ఇష్టపడి పని చేశారు
నాయకుడి ప్రజా సంక్షేమం గురించే ఆలోచించారు
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు పేరు, రూపం మార్పుతో నేటికీ సుపరిపాలనలో
భాగస్వామ్యం అవుతున్నాయి
మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ చేసిన కృషి ఆదర్శనీయమైనది
నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ఇదే వేదిక నుంచి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం
ప్రతిభా పురస్కారాల ముఖ్య ఉద్దేశం స్ఫూర్తిని నింపటమే
నెల్లూరు : ఎన్టీఆర్ స్ఫూర్తి కాలానికి, సినిమాలకు, రాజకీయాలకు అతీతమైనదని,
వారిని ప్రజలు తెలుగు జాతికి వెలుగు దివిటీలు పట్టిన ధీరుడిగానే కలకాలం
గుర్తుంచుకుంటారని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
పేర్కొన్నారు. నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో
ఎన్టీఆర్ శతజయంతి ఏడాదిని పురస్కరించుకుని “యుగపురుషునికి శతవసంత నీరాజనం”
పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు మెచ్చిన
ఎన్టీఆర్ సినీ గీతాలతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆద్యంతం ఆకట్టుకుంది. ఇదే
వేదిక నుంచి పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రతిభా పురస్కారాల ముఖ్య
ఉద్దేశం చక్కని ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహం ఇవ్వటమే గాక, భవిష్యత్తులు
వారు ఇతరులకు ప్రేరణగా నిలబడ్డాలన్నదే అని ముప్పవరపు వెంకయ్య నాయుడు
పేర్కొన్నారు. ఎన్టీఆర్ ని నటుడిగానో, రాజకీయ నాయకుడిగానో తెలుగు ప్రజలు
భావించరన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు, వారిని తెలుగు వారి గుండె చప్పుడుగా
అభివర్ణించారు. చక్కని స్ఫురద్రూపంతో పాటు ఎన్నో పురాణ, చారిత్ర పాత్రలకు
ఎన్టీఆర్ వన్నె తీసుకొచ్చారన్న ఆయన, వారు నటించని పాత్ర లేదంటే అతిశయోక్తి
కాదని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన 22 పురాణ పాత్రల గురించి
ప్రస్తావించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు, పురాణ పాత్రల రూపంలో ముందు తరాలకు మన
సంస్కృతిని అర్థమయ్యే విధంగా తెలియజేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే చక్కని
రూపమే కాదు, అంతకు మించిన వాచకం అన్న వెంకయ్యనాయుడు తెలుగు భాషే తమిద్దరని
దగ్గర చేసిందని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవటం ద్వారా ఎన్టీఆర్ కు
నిజమైన నివాళి అందిచవచ్చని పేర్కొన్న ఆయన, ఎన్టీఆర్ అభిమానుల కుటుంబాలు తెలుగు
మాట్లాడితే… ప్రతి తెలుగు వాడు తెలుగుకు దగ్గరగా ఉన్నట్లేనని
అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ స్థానం మరింత ప్రత్యేకమైనదన్న
ముప్పవరపు వెంకయ్యనాయుడు వారు ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ పేరు, రూపం
మార్చుకుని సుపరిపాలన భాగస్వామ్యమై ముందుకు సాగుతున్నాయని తెలిపారు. వెనుకబడిన
వర్గాలు, మహిళల సాధికారత కోసం ఎన్టీఆర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తు
పెట్టుకుంటారన్న ఆయన, సమగ్రమైన విధానాలను ప్రతిపాదించటం మొదలుకుని సంక్షేమ
పథకాలు గడపగడపకూ చేరేవరకూ అలుపెరగకుండా ఎన్టీఆర్ శ్రమించారని పేర్కొన్నారు.
రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా గృహాలు, సగం ధరకే జనతా వస్త్రాలు,
ఉపాధి హామీ, పింఛన్లు, చిన్నకారు రైతులకు తక్కువ ధరకే విద్యుత్, మండల వ్యవస్థ
నిర్మాణం, ప్రతి మండల కేంద్రంలో విద్య, వైద్య సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం,
ఎంసెట్ నిర్వహణ, క్యాపిటేషన్ ఫీజు రద్దు, మద్యపాన నిషేధం వంటి ఎన్టీఆర్ పథకాల
గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ చేసిన
కృషి దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ప్రజాభిమానం ఒక్కరోజులో సాధ్యమైనది కాదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు,
ఎన్టీఆర్ జయంతి అంటే వారి పటానికి దండ వేయటం కాదని, వారి స్ఫూర్తిని
అందిపుచ్చుకోవటమే అని పేర్కొన్నారు. నటుడిగా ఇష్టపడి కష్టపడి పని చేసి ప్రజలకు
చేరువ అయిన ఆయన, నాయకుడిగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తూ అందరి
అభిమానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా
ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందు తరాలకు అందించగలమన్న ఆయన, ఎన్టీఆర్ స్ఫూర్తితో
యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. సుప్రసిద్ధ సినీ
దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని
శ్రీనివాస్, మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ సహా పలువురు ట్రస్టీలు, ఎన్టీఆర్
అభిమానలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు.