తైపేయి : తైవాన్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర
పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం ప్రజల నుంచి ఓట్లు విదిలించలేక
పోయింది. విశేషం ఏంటంటే చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక
ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.
ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా
చేస్తున్నట్లు ప్రకటించారామె. అయితే
ఈ ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. ‘‘ఎన్నికల ఫలితాలు మేం
ఆశించినట్లు రాలేదు. తైవాన్ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమికి అంతా
నాదే బాధ్యత. డీపీపీ చైర్ఉమెన్ బాధ్యతల నుంచి ఇప్పటికిప్పుడే
తప్పుకుంటున్నా’’ అని సాయ్ ఇంగ్-వెన్ మీడియాకు తెలియజేశారు. పార్టీ చీఫ్
బాధ్యతల నుంచి తప్పుకునప్పటికీ 2024 వరకు ఆమె తైవాన్ అధ్యక్ష పదవిలో
కొనసాగుతారు. మేయర్లు, కౌంటీ చీఫ్‌లు, లోకల్ కౌన్సిలర్లు ఇలా జరిగింది
స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఈ ఎలక్షన్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా
తీసుకున్నారామె. చైనా విధానాలకు, మిలిటరీ ఉద్రిక్తతల పట్ల తైవాన్ ప్రజల నుంచి
ఏమేర వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని
సాయ్ ఇంగ్-వెన్ భావించారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. చైనా వ్యతిరేకత
ప్రచారం వర్కవుట్ కాలేదు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్
పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రచార సమయంలో డీపీపీ చైనా వ్యతిరేక
గళం వినిపించగా కేఎంటీ మాత్రం చైనాతో డీపీపీ ప్రభుత్వ వైరం శ్రుతి
మించుతోందని, అది దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేసింది. అయినప్పటికీ తాము
చైనాకు కొమ్ము కాయబోమని, తైవాన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం సంప్రదింపులు
జరుపుతామన్న ప్రచారంతో జనాల్లోకి దూసుకెళ్లింది.
ఇక శనివారం వెలువడిన తైవాన్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో 21 నగర మేయర్
స్థానాలకు గానూ పదమూడింటిని కైవసం చేసుకుంది కేఎంటీ. అందులో రాజధాని తైపేయి
కూడా ఉంది. కౌంటీ చీఫ్ సీట్ల సంఖ్యను సైతం పెంచుకుంది. అయితే గత ఎన్నికల్లో
మాదిరే ఈ దఫా ఎన్నికల్లోనూ సైతం డీపీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు.
2018లో డీపీపీ కేవలం ఐదు స్థానాలే దక్కించుకోగా చైనాను ఎదుర్కొంటున్న
పరిణామాలు జనాల నుంచి సానుకూల ఫలితాలు తెప్పిస్తాయని భావించింది. అయితే..
ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఐదు స్థానాలే కైవసం చేసుకుంది. అందులో పెద్దగా
ప్రభావితం చూపని ప్రాంతాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫలితంపై చైనా ఇంకా
స్పందించలేదు. కానీ, జిన్హువా వార్తా సంస్థ మాత్రం తైవాన్ స్థానిక ఎన్నికల్లో
పార్టీ పనితీరుకు బాధ్యత వహిస్తూ సాయ్ రాజీనామా చేశారంటూ ఓ కథనం
ప్రచురించింది.
ఇదిలాఉంటే కరోనా సమయంలో తైవాన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అందరికంటే
ముందే మేల్కొని లాక్డౌన్ విధించకుండా కేసుల ట్రేసింగ్‌పై దృష్టి సారించారు
ఆమె. తద్వారా తైవాన్‌లో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఈ ఘనతకు గానూ
2020 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో సాయ్ ఇంగ్-వెన్కి చోటు దక్కింది.
ఇప్పటికీ తైవాన్ ప్రయాణాలకు కరోనా నెగెటివ్ ఫలితం. అదీ ప్రయాణానికి మూడు
రోజుల ముందు తీసుకున్న సర్టిఫికెట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులకు సమర్పించాల్సి
ఉంటుంది.