వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్
రాజమండ్రి : దయ, ప్రేమ, త్యాగం..ప్రతీ ఒక్కరిలోనూ ఉండాలని ఇదే ప్రభువైన ఏసు కోరుకున్నదని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్ డాక్టర్ జాన్ వెస్లీ చర్చి, ఆనంద్ రీజెన్సీ ఎదురుగా బైబిల్ మిషన్ కాతెడ్రాల్ చర్చి, రాజమండ్రి రూరల్ బుచ్చయ్య నగర్ బిషప్ లాజరస్ వారి రాక్ చర్చి, ఐఎల్టీడీ జంక్షన్ ఎపిఫనియా చర్చి, ఐఎల్టీడీ జంక్షన్ గ్లోరియా డి పారిష్ లూథరన్ చర్చి, బైపాస్ రోడ్డు డాక్టర్ మల్లిపూడి నెల్సన్ మెమోరియల్ లూథరన్ చర్చి, లాలా చెరువు జాన్ వెస్లీ వారి హోసన్న చర్చి, లాలా చెరువు బైబిల్ మిషన్ చర్చి, ఏవీఏ రోడ్డులో ప్రతాప్ సిన్హా చర్చి, ఆనం కళా కేంద్రం హోలీ ట్రినిటీ చర్చి, నటరాజ్ థియేటర్ వద్ద దహించు అగ్ని చర్చిలో ఆదివారం ఉదయం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఏసు మానవాళి కోసం ఎన్నో త్యాగాలు, బాధలు, అవమానాలు భరించారన్నారు. లోకంలో సమైక్యత, ప్రశాంత జీవనం కోసం ప్రతీ ఒక్కరూ ఏసు నడిచిన మార్గంలో పయనించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏసు దయార్ద్ర హృదయుడని ఆయన వచనాలను అనుసరించి తోటి వారిపై ప్రతీ ఒక్కరూ దయతో ఉండాలని, పాపులను రక్షించేందుకు ప్రభువు ప్రాణత్యాగం చేసిన ఏసు మనందరకీ ఆదర్శం కావాలన్నారు. మంచి చేసే మనుషులను చూసి హేళన చేయడం చాలా సులువని, అదే అభినందించాలంటే పెద్ద మనసు ఉండాలన్నారు. మనలో ఉన్న అహంకారం వల్ల తోటి వారిని ప్రేమించలేకపోతున్నాం, అభిమానించలేకపోతున్నామని ఇది మానవునిలోని నీచమైన మనసుకు సాక్షీభూతమని అన్నారు. దైవ కుమారుడు ఏసును ఆరాధించే వారు తోటివారిని ఆదుకునేందుకు ముందుకు వస్తారని, అదే నిజమైన విశ్వాసం, సేవ అన్నారు. పరిశుద్ధమైన మనసుతో అందరినీ ప్రేమించడమే ఏసు మార్గమని, అదే క్రీస్తు కోరుకున్నదీ అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉండాలని, ప్రభువుని నమ్ముకున్న జగన్ కు రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా ఏసు ఆశీస్సులు, మీ అందరి ప్రేమ ఇవ్వాలని ఎంపీ భరత్ ఈ సందర్భంగా కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసి నేరుగా ఆదివారం రాజమండ్రి వచ్చిన ఎంపీ భరత్ నేరుగా నగరంలోని వివిధ చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ఆయా చర్చిల నిర్వాహకులు ఎంపీకి పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. క్రిస్మస్ వేడుకలకు హాజరైన దైవారాధకులందరికీ ఎంపీ భరత్ హ్యాపీ క్మిస్మస్ తెలిపారు.