అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఇక్కడ పోటీని
అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్, వామపక్ష కూటమి సీరియస్‌గా
తీసుకుంటున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న
డిమాండ్‌తో ఆవిర్భవించిన తిప్రమోత పార్టీ సంచలనం సృష్టించే అవకాశాలున్నాయని
రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తుకు అంగీకరించక పోయినా ప్రత్యేక రాష్ట్రం
డిమాండ్‌కు మద్దతు ఇచ్చే పార్టీలతో తమ మిత్రత్వం ఉంటుందని ప్రకటించింది.
అధికార బీజేపీని గద్దె దించడానికే తాము చేతులు కలిపినట్టు
కాంగ్రెస్-సీపీఐ(ఎం) ఇప్పటికే స్పష్టం చేసి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. 60
మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీలో 20 సీట్లు గిరిజన ప్రాంతాలకు రిజర్వ్
చేశారు. 2018 ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ 36 సీట్లు
గెల్చుకోగా, అందులో సగం ఈ ప్రాంతానికి చెందినవే. అయితే గిరిజన ప్రాంతంలో ఈసారి
తిప్ర మోత పార్టీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. రాజ కుటుంబానికి చెందిన
ప్రద్యుత్ కిశక్షర్ మాణిక్య డెబ్బర్మ స్థాపించిన ఈ పార్టీ గతంలో గిరిజన
ప్రాంతాల్లో బీజేపీ పొందిన ఓట్లను గణనీయంగా చీల్చి సంచలనం సృష్టిస్తుందని
సీపీఐ(ఎం) అంచనా వేస్తున్నది. ఈ పార్టీతో సీపీఐ(ఎం) ఎలాంటి పొత్తు
పెట్టుకోకున్నా, స్థానిక స్థాయిలో ఒప్పందం ఉన్నదని ఆ పార్టీ నేత సీతారాం ఏచూరి
తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కమలం పార్టీకి చిక్కులు తప్పవని రాజకీయ
పరిశీలకులు కూడా అంగీకరిస్తున్నారు. పైగా ఈసారి మిత్ర పార్టీ ఐపీఎఫ్‌టీకి
బీజేపీ ఐదు సీట్లు మాత్రమే కేటాయించడం ఆ పార్టీకి ప్రతికూలాంశంగా మారుతుందని
భావిస్తున్నారు. ఈసారి బీజేపీకి ప్రజావ్యతిరేకత తప్పదని పరిశీలకులు సైతం
భావిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలు భావిస్తున్నందునే
తాము త్రిపురలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్టు సీతారాం ఏచూరి
పేర్కొన్నారు.