విజయవాడ : ఈ నెల 16వ తేదీన త్రిపుర లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిపి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం ఎ బేబి, బి వి
రాఘవులు డిమాండ్ చేశారు. బిజెపి అధికారాన్ని వినియోగించి ఎన్నికల్లో
గెలవటానికి అనేక అప్రజాస్వామిక ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. దేశంలోని
ప్రజాస్వామిక శక్తులు ఈ చర్యలు నిలువరించేట్లు వత్తిడి తేవాలని కోరారు.
స్థానిక గవర్నర్ పేట ఎం బి వి కె లో ఆదివారం త్రిపుర సంఘీభావ సభ జరిగింది.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.కాశీనాధ్ సభకు అధ్యక్షత వహించారు.
ముఖ్య వక్తలు మాట్లాడుతూ 37 లక్షల జనాభా ఉన్న ఈశాన్య రాష్ట్రం త్రిపుర అని
చెప్పారు. గత ఎన్నికల్లో గెలిచిన బిజెపి అప్పటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు
నెరవేర్చలేదన్నారు. ముఖ్య మంత్రి ని మార్చి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం
చేస్తున్నదని చెప్పారు. జనాభా లో మూడవ వంతు గిరిజనులు ఉన్న రాష్ట్రంలో బిజెపి
అర్ధ ఫాసిస్టు చర్యలు చేస్తున్నదన్నారు. 600 కు పైగా సిపిఎం కార్యాలయాల ను
ధ్వంసం చేసిందని తెలిపారు. 200పైగా కార్యకర్తలను హత్య చేశారని చెప్పారు. గత
ఎన్నికల్లో కేవలం 1.2 శాతం ఓట్లతో సిపిఎం ఓడిపోయిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రజలలో బిజెపి విధానాల ఎడల ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో బిజెపి ని
ఓడిస్తుందని భావించి అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నదని అన్నారు వామపక్షాలు
ప్రత్యేకించి సిపిఎం, బిజెపి విధానాలను నికరంగా వ్యతిరేకిస్తూ
ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నందున సిపిఎం నాయకులు కార్యకర్తలపై దాడులు
చేస్తున్నారని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ను ఎన్నికల్లో
ప్రచారానికి వెళ్లడానికి ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలియజేశారు.
ఇప్పటికే ప్రధాని మోదీ ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించారన్నారు. హోంమంత్రి
అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా, యోగీ త్రిపురలో మకాం పెట్టి రాష్ట్రంపై
కేంద్రీకరించారని తెలిపారు. గుజరాత్ ,అస్సాం రాష్ట్రంలో నుండి పోలీసులను ఈ
ఎన్నికల సందర్భంగా రప్పించారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ బిజెపి కార్యకర్తలను ఇతర
రాష్ట్రాల నుండి త్రిపురకు తెప్పించారని తెలియజేశారు ఈ చర్యలు త్రిపరలో
ఎన్నికల సందర్భంగా హింసను ప్రేరేపించటం ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును
వినియోగించుకోవటం విచ్చలవిడిగా డబ్బు పంపిణీకి దారి తీయడం కు అవకాశాలు
ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ చర్యలు నిలవరించడానికి దేశంలోని
ప్రజాస్వామిక శక్తులు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు స్వేచ్ఛగా ఎన్నికలు
జరిగితే ప్రజలు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోగలుగుతారని వారు అన్నారు
ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జిల్లా
కార్యదర్శి డివి కృష్ణ ఎం శ్రీదేవి భూపతి రమణ బి సత్యబాబు టి ప్రవీణ్ కృష్ణ
పాల్గొన్నారు.