దళిత ఓటర్ల దయ ఎటువైపో!
25 అసెంబ్లీ స్థానాల్లో దళిత ఓటర్లు బలమైన ఓటు బ్యాంకు
ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్లో ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ
రాష్ట్రంలో 25 అసెంబ్లీ స్థానాల్లో దళిత ఓటర్లు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు.
అయితే వారంతా ఒకే పార్టీకి గుంపగుత్తగా మొగ్గుచూపిన దాఖలాలు ఇప్పటివరకు
దాదాపుగా లేవు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు
పోరులో ఎస్సీల ఓట్లు చీలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల
వేడి రాజుకున్న గుజరాత్లో దళితులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. పాతిక
అసెంబ్లీ స్థానాల్లో బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ఆ వర్గం గంపగుత్తగా ఒక
పార్టీవైపే మొగ్గుచూపిన దాఖలాలు ఇప్పటివరకు దాదాపుగా లేవు. ఈ ఏడాది చివర్లో
జరగనున్న ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. బీజేపీ,
కాంగ్రెస్, ఆప్‌ల మధ్య ముక్కోణపు పోరులో ఎస్సీల ఓట్లు చీలుతాయని అంచనాలు
వెలువడుతున్నాయి.
మూడు ఉప వర్గాలు
గుజరాత్ జనాభాలో దళితులు 8% ఉంటారు. వారిలో వాంకర్, రోహిత్, వాల్మీకి అనే
మూడు ఉప వర్గాలున్నాయి. మిగతా రెండు వర్గాలతో పోలిస్తే వాంకర్ల జనాభా కాస్త
ఎక్కువ. వీరు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వాల్మీకీల్లో
చాలామంది పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వాంకర్లలో అత్యధికులు
బీజేపీకి మద్దతుగా నిలుస్తుంటారన్న పేరుంది. అయితే మొత్తంగా రాష్ట్రంలో దళితుల
తరఫున బలమైన నేత ఎవరూ లేరు. ఫలితంగా దళితులు ఏకతాటిపై నిలవడం లేదని.. రాష్ట్ర
రాజకీయాల్లో వారికి సముచిత ప్రాధాన్యం కొరవడటానికి అది కారణమవుతోందని
విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పార్టీల పోటాపోటీ
రాష్ట్రంలో 13 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. ఇవి కాకుండా మరో 12
నియోజకవర్గాల్లో దళితుల ఓట్ల వాటా 10శాతం పైగా ఉంటుంది. మొత్తంగా ఈ పాతిక
సీట్లలో అభ్యర్థుల జయాపజయాలను ఎస్సీలు ప్రభావితం చేయగలరు. దీంతో వారి అండ
దక్కించుకునేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా రాష్ట్రంలో
పాలనాపగ్గాలు ఆశిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ పడుతున్నాయి. అయితే
గతంలో తరహాలోనే రాష్ట్రంలో దళితులు ఈ దఫా కూడా మూకుమ్మడిగా ఒక పార్టీ వైపు
నిలిచే అవకాశాల్లేవు.
బీజేపీ ఓటుబ్యాంకుపై ధీమా
రాష్ట్రంలో 1995 నుంచీ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను
బీజేపీయే దక్కించుకుంటోంది. 2007, 2012 ఎన్నికల్లో వీటిలో కాంగ్రెస్‌పై కమలదళం
స్పష్టమైన ఆధిక్యం కనబరిచినా గత ఎన్నికల్లో అంతరం బాగా తగ్గింది. 2017లో ఈ
స్థానాల్లో ఏడింటిని బీజేపీ గెల్చుకోగా, హస్తం పార్టీ ఐదింటిని సొంతం
చేసుకుంది. మరో స్థానంలో కాంగ్రెస్ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి జిగ్నేష్
మేవానీ విజయం సాధించారు. ఇది కమలనాథులను కలవరపెట్టే అంశమే. అయితే రాష్ట్రంలో
దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ పలువురు దళిత నేతలకు వివిధ ప్రభుత్వ
సంస్థల్లో పదవులు కట్టబెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం
ప్రవేశపెట్టిన పథకాలు తమకు లబ్ధి చేకూరుస్తాయని కమలనాథులు ధీమాగా ఉన్నారు.
పక్కా వ్యూహాలతో కాంగ్రెస్
రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికార పీఠానికి దూరంగా ఉండటం కాంగ్రెస్‌కు కొంత
ప్రతికూలాంశం. ఇప్పటికే పలువురు దళిత నాయకులు పార్టీని వీడి కాషాయతీర్థం
పుచ్చుకున్నారు. పార్టీ అనుసరించిన ‘క్షత్రియ-హరిజన్-ఆదివాసీ-ముస్లిం(ఖామ్)’
వ్యూహం కూడా దళితులను కొంత దూరం చేసింది. అయితే గత ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లను
రాబట్టుకోవడంలో హస్తం పార్టీ సఫలీకృతమైంది. ఇందుకు ఉనా ఘటన బాగా కలిసొచ్చిందని
చెప్పొచ్చు. గోవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ 2016లో గిర్ సోమనాథ్
జిల్లాలోని ఉనాలో కొందరు దళితులను అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు తీవ్రంగా
కొట్టారు. ఆ దాడిని నిరసిస్తూ పెద్దయెత్తున కాంగ్రెస్ ర్యాలీలు
నిర్వహించింది. తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా
కనిపించింది.ఈ ఎన్నికల్లో జోరు పెంచేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
దళితుల ఓట్లు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న స్థానాలపై ప్రత్యేకంగా
దృష్టిసారిస్తోంది. అవసరమైతే అన్‌రిజర్వుడు స్థానాల్లోనూ ఎస్సీ అభ్యర్థులను
నిలబెట్టి ఆ వర్గం మద్దతును దక్కించుకోవాలని భావిస్తోంది.