హైదరాబాద్: త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాలవారీగా సమావేశాల నిర్వహణలో భాగంగా మంగళవారమిక్కడ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నేతలతో ఆయన సమీక్షలు జరిపారు. సభాపతి ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని, అవి సక్రమంగా ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దన్నారు. నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియోజకవర్గాల్లో నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని ఆయన స్పష్టంచేశారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లను కేటాయిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులకు ఈ నిధుల కేటాయింపు, పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, లోక్‌సభ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతలకు సూచించారు. ఆయా జిల్లాల మంత్రులు మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి చేయాల్సిన పనులపై సూచనలిచ్చారు. జిల్లాల నేతలను కూడా సలహాలు, సూచనలు అడిగారు. పలువురు జిల్లాల నేతలు మాట్లాడుతూ.. ఇప్పటికీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు వంటి నామినేటెడ్ పదవుల్లో భారాస నేతలే కొనసాగుతున్నందున గ్రామస్థాయిలో వారితో సమానంగా హోదాల్లో తిరగలేకపోతున్నామని చెప్పారు. మార్కెట్ల పాలకవర్గాల పదవీకాలం పూర్తయితే వెంటనే భర్తీ చేయాలని సూచించారు.