గుంటూరు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి వచ్చేలా బిజెపిని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్ తాజాగా సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలోనే జనసేన, టిడిపితో పొత్తుపై ఒక స్పష్టతకు వచ్చేలా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి ముందుగా దూకింది. పొత్తు నిర్ణయాలు తేలక టిడిపి, జనసేన, బిజెపి ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.
పొత్తు ధర్మంపై ఇరు పార్టీల ఆగ్రహం
వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయబోతున్నామంటూ జనసేన, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు చెబుతున్నారు. కూటమి చర్చలు పూర్తికాకుండానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట, అరకు అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. తనపై ఒత్తిడి ఉండడం వల్లే అభ్యర్థులను ప్రకటించాలంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పైన పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తు పై స్పష్టత రాకుండానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులను పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ప్రకటించారు. రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పొత్తు, సీట్ల పంపకాల ప్రక్రియ వేగంగా పూర్తి కాకపోతే ఇటువంటి ఇబ్బందులే తలెత్తుతాయని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ తరహా చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత వేగంగా పొత్తు, చెట్ల పంపకాలపై స్పష్టతకు రావాలని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు.