జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు
మనసున్నత్వరలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు జనసేన అధ్యక్షులు
పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో రైతు స్వరాజ్య
వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రైతు
స్వరాజ్య వేదిక క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి కౌలు రైతుల స్థితిగతులపై
రూపొందించిన నివేదికను అందచేశారు. వీరి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్
అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రంలో పండే వరి
పంటలో 80 శాతం కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదే. ఇంతటి కీలకమైన పంట వేసి
నష్టాల పాలై, అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వరితోపాటు
మిర్చి, పత్తి లాంటి పంటలు వేసినవారూ నష్టపోతున్నారు. రైతు భరోసా యాత్రల
సందర్భంలో కౌలు రైతుల కుటుంబాల ఆవేదన నేరుగా తెలుసుకొంటున్నాను” అన్నారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఇప్పటి వరకూ చేసిన రైతు భరోసా యాత్రల్లో 8
జిల్లాల్లో 700కిపైగా కౌలు రైతు కుటుంబాలకి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం
చేశాం. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన భరోసా కలిగించగలుగుతున్నాం. జనసేన పార్టీ
తొలి నుంచి రైతు పక్షం వహిస్తోంది’ అని అన్నారు. ఈ సమావేశంలో రైతు స్వరాజ్య
వేదిక నుంచి కిరణ్ కుమార్ విస్సా, బి.కొండల్ రెడ్డి, బాలు గాడి, కిసాన్
మిత్ర హెల్ప్ లైన్ ప్రతినిధులు శ్రీహర్ష, భార్గవి పాల్గొన్నారు.