సెమీస్ బెర్త్ లో భారత్‌కు లైన్ క్లియర్
ప్రపంచ క్రికెట్లోని బలమైన జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ జట్టుకు ఐసీసీ మెగా టోర్నీల్లో లక్ ఏమాత్రం కలిసి రాదనే అభిప్రాయం ఉంది. గెలవాల్సిన మ్యాచ్‌ల్లోనూ ఒత్తిడికి గురై ఓడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికాకు అదృష్టం ఏమాత్రం కలిసి రాలేదు. వర్షం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో.. జింబాబ్వేతో కలిసి పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. టాప్-2 బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలం కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వెస్లీ మెదెవెరే 18 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిల్టన్ షుంబా (20 బంతుల్లో 18) అతడికి అండగా నిలిచాడు. దీంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించి.. దక్షిణాఫ్రికాకు 64 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. సఫారీలకు ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. చతారా వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లు, ఓ సిక్స్, సింగిల్ బాదిన డికాక్.. 23 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓవర్లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే.
రెండో ఓవర్లో ఒక బంతి పడిందో లేదో వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. నాలుగైదు నిమిషాల తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలు కాగా.. డికాక్ 4 ఫోర్లు బాదడంతోపాటు అంతకు ముందే గరవ నోబాల్ వేయడంతో ఆ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. రజా వేసిన మూడో ఓవర్లో 11 పరుగులొచ్చాయి. అంటే 3 ఓవర్లలోనే సౌతాఫ్రికా 51/0గా నిలిచింది. మరో 13 పరుగులు చేస్తే సౌతాఫ్రికాదే విజయం. డికాక్ దూకుడును బట్టి చూస్తే.. అతడు మరో 4-5 బంతులు ఆడుంటే మ్యాచ్ దక్షిణాఫ్రికా వశమయ్యేది. కానీ డికాక్‌కు పోటీగా వరణుడు ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈసారి వర్షం పెద్దగా కురవడంతోపాటు.. మ్యాచ్ టైం దాటిపోయింది. రిజర్వ్ డే లేకపోవడంతో.. మ్యాచ్ ఫలితం తేలలేదని ప్రకటించిన అంపైర్లు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు చెరో పాయింట్ ఇచ్చారు.
ఈ మ్యాచ్ రద్దు కావడం సౌాతాఫ్రికాకు ఇబ్బందికరంగా మారనుండగా.. భారత్ ఈజీగా సెమీస్ చేరేందుకు దోహదం చేయనుంది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వేలపై గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. మరోవైపు పాక్ మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.