మూడు దేశాలలో దగ్గు సిరప్‌లతో సంబంధం ఉన్న 300 మందికి పైగా పిల్లలు మరణించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దృష్టి సారించింది. దగ్గు మందులు తయారీదారుల నుండి కలుషితమయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఒక పరిశోధనను ప్రారంభించాలని నిర్ణయించింది. నివేదికల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సిరప్‌లలో “ఆమోదించలేని” స్థాయి టాక్సిన్లను కనుగొంది. భారతదేశం, ఇండోనేషియాలోని ఈ ఆరు తయారీదారులు ఉపయోగించే ముడి పదార్థాలపై మరింత సమాచారాన్ని కోరుతోంది.
ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్ మరియు గాంబియాలో 300 మందికి పైగా పిల్లలు, ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు దగ్గు సిరప్‌లను తీసుకోవడం వల్ల తీవ్రమైన మూత్రపిండాల గాయంతో మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దగ్గు సిరప్‌లలో డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ అధిక స్థాయిలో ఉన్నట్లు కనుగొనబడింది. కంపెనీలు అదే సరఫరాదారుల నుండి వాటిని సేకరించాయా? లేదా? అని పరిశీలిస్తోంది. నాలుగు దగ్గు సిరప్‌లను ‘నాణ్యత లేని ఉత్పత్తులు’గా పేర్కొంది. “ఈ కలుషితాలు పారిశ్రామిక ద్రావకాలు మరియు యాంటీఫ్రీజ్ ఏజెంట్లుగా ఉపయోగించే విషపూరిత రసాయనాలు, ఇవి తక్కువ మొత్తంలో కూడా ప్రాణాంతకం కావచ్చు మరియు మందులలో ఎప్పుడూ కనిపించకూడదు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.